శారాజీపేటలో ఆవుపై పులి దాడి | - | Sakshi
Sakshi News home page

శారాజీపేటలో ఆవుపై పులి దాడి

Feb 6 2026 7:21 AM | Updated on Feb 6 2026 7:21 AM

శారాజ

శారాజీపేటలో ఆవుపై పులి దాడి

ఆందోళన చెందుతున్న ప్రజలు

అప్రమత్తంగా ఉండాలంటున్న అటవీశాఖ అధికారులు

ఆలేరురూరల్‌: ఆలేరు మండలం శారాజీపేట గ్రామ శివారులోని దూడల శ్రీధర్‌కు చెందిన ఓ ఆవుపై మంగళవారం రాత్రి పులి దాడి చేసి చంపింది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సంఘటనా స్థలాన్ని జిల్లా అటవీశాఖ ఫ్లయింగ్‌స్క్వాడ్‌ బాబ్‌జీరావు, డీఎఫ్‌ఓ సుధాకర్‌రెడ్డి, డీఎస్పీ శ్రీనివాస్‌నాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ పులి చుట్టు పక్కల పది పదిహేను కిలోమీటర్ల పరిధిలోనే సంచరిస్తోందన్నారు. పులిని పట్టుకోవడానికి రెండు యానిమల్‌ ట్రాకర్స్‌ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. థర్మల్‌ డ్రోన్ల సహాయంతో పులి జాడను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. టైగర్‌ మానిటరింగ్‌ టీం అన్ని విధాలుగా కృషి చేస్తోందన్నారు.

నాలుగు బోన్లు ఏర్పాటు

పులి సంచారం నేపథ్యంలో మేకను ఎరగా పెట్టి ఇప్పటి వరకు 4 బోన్లు, 20 సోలార్‌ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. శారాజీపేటలో ఆవును చంపిన పులి అడుగు జాడలు గొలనుకొండ గ్రామం శివారు వరకు ఉన్నట్లు గుర్తించామన్నారు. థర్మల్‌ డ్రోన్ల సహాయంతో చుట్టపక్కల ప్రాంతాలను పరిశీలిస్తున్నామన్నారు.

ఇంకెప్పుడు పట్టుకుంటారు?

మూడు వారాలకుపైగా పులి సంచరిస్తుంటే ఇంకెప్పుడు పట్టుకుంటారని శారాజీపేటలో అధికారులను స్థానికులు నిలదీశారు. బావుల వద్దకు వెళ్లడానికి జంకుతున్నామని, పనులు చేసుకోలేకపోతున్నామని, ఎక్కడ నుంచి ఎటువైపు వస్తుందోనని ఆందోళన చెందుతున్నామని చెప్పారు.

పల్లెల్లో డప్పు చాటింపు

రాజాపేట : పులి సంచారం నేపథ్యంలో రాజాపేట మండలంలోని రేణికుంట, రాజాపేట తదితర గ్రామాల్లో సర్పంచ్‌లు బుధవారం ఉదయం డప్పు చాటింపు వేయించారు. పులి సంచరిస్తుందని, ప్రజలు తెల్లవారిన తరువాతే గ్రామాలు దాటి సాయంత్రం 6 గంటలలోపే ఇంటికి చేరాలని సూచించారు. రైతులు వ్యవసాయ పొలాల వద్దకు చప్పుడు చేస్తూ కర్రలు పట్టుకొని గుంపులుగా వెళ్లాలన్నారు. పొలాల చుట్టూ కరెండు తీగలు, ఉచ్చులు పెట్టొద్దని అలా పెట్టి పులి మరణానికి కారణం అయితే జైలు పాలు అవుతారని హెచ్చరించారు.

శారాజీపేటలో ఆవుపై పులి దాడి1
1/1

శారాజీపేటలో ఆవుపై పులి దాడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement