ప్రతి అంశంపై నిశిత పరిశీలన అవసరం
సాక్షి, యాదాద్రి : ఎన్నికల్లో కీలకమైన ఓటింగ్ ప్రక్రియకు సంబంధించి ప్రతి అంశంపై నిశిత పరిశీలన అవసరమని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లోని మినీ మీటింగ్ హాల్ మైక్రో అబ్జర్వర్లకు నిర్వహించిన శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా పోలింగ్‌కు ముందు రోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌కు చేరుకొని పోలింగ్ సామగ్రి సరిగ్గా అందిందా లేదా అన్నది పరిశీలించాలన్నారు. అనంతరం పోలింగ్ సిబ్బందితో కలిసి పోలింగ్ స్టేషన్లకు చేరుకోవాలని సూచించారు. నిబంధనలకు అనుగుణంగా మాక్ పోలింగ్ నిర్వహించారా లేదా అన్నది పరిశీలించాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలను చూసుకోవాలన్నారు. పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి పూర్తయ్యేంత వరకు అన్ని అంశాలను గమనిస్తూ, ఎప్పటికప్పుడు వాటిని జనరల్ అబ్జర్వర్ దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ఈ శిక్షణ తరగతుల్లో మాస్టర్ ట్రైనర్లు నర్సిరెడ్డి, మైక్రో అబ్జర్వర్లు పాల్గొన్నారు.
నిధులు వినియోగించుకోవాలి
పీఎంశ్రీ నిధులను పాఠశాలలకు తప్పక వినియోగించాలని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో మినీమీటింగ్ హాల్‌లో పీఎం శ్రీ పాఠశాలల నిధుల వినియోగంపై ప్రధానోపాధ్యాయులు, ప్రత్యేక అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పీఎంశ్రీ పథకం పరిధిలో ఉన్న పాఠశాలల్లో యోగా , సైన్స్, గణిత ప్రయోగాలకు అవసరమున్న పరికరాల కొనుగోలు, విద్యార్థులకు విజ్ఞాన, పరిశ్రమల అవగాహన పర్యటనలు, కళలు–హస్తకళల వంటి సహపాఠ్య, పాఠ్యేతర కార్యక్రమాల నిర్వహణకు మంజూరైన నిధులను వినియోగించుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా విద్యాధికారి సత్యనారాయణ, ట్రెజరీ అధికారి మోహన్, అదనపు సాంఘిక సంక్షేమ అధికారి, మండల విద్యాధికారులు, పీఎం శ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సెక్టోరియల్ అధికారులు తదితర అధికారులు పాల్గొన్నారు.
ఫ అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు


