రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్ కనుమరుగు
ఫ కేంద్ర మంత్రి
కిషన్‌రెడ్డి
భువనగిరి : రాష్ట్రంలో రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్ పార్టీ కనుమరుగవుతుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. మంగళవారం భువనగిరి పట్టణంలోని గంజ్ ఏరియాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ కుటుంబం దోచుకోవడం తప్ప పదేళ్ల కాలంలో చేసిందేమీ లేదన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యనే పోటీ ఉంటుందన్నారు. బీఆర్‌ఎస్ పార్టీకి రాష్ట్రంలో చాలా మున్సిపాలిటీల్లో అభ్యర్థులు కూడా కరువయ్యారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏ ఒక్క హామీని నేరవేర్చలేదన్నారు. కాంగ్రెస్ మంత్రులు పంపకాల కోసం రోడ్డు ఎక్కుతున్నారని, గతంలో దోచుకున్న సొమ్ము కోసం బీఆర్‌ఎస్ పార్టీలో పంచాయితీ నడుస్తోందని ఎద్దేవా చేశారు. భువనగిరి మున్సిపాలిటీలో బీజేపీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేస్తున్న పథకాలను గడపగడపకు తీసుకెళ్లి ప్రతిఒక్కరికి వివరించాలన్నారు. ఈ సందర్భంగా భువనగిరి మున్సిపాలిటీలో బీజేపీ అభ్యర్థులతో పరిచయవేదిక ఏర్పాటు చేసి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూర నర్సయ్యగౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గూడూరు నారాయణరెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్, మాజీ అధ్యక్షుడు పాశం భాస్కర్, నాయకులు నర్ల నర్సింగ్‌రావు, సుర్వి శ్రీనివాస్, పడమటి జగన్మోహన్‌రెడ్డి, చందుపట్ల వెంకటేశ్వరరావు, చందా మహేందర్ గుప్తా, యాదిరెడ్డి, రత్నపురం శ్రీశైలం, రాళ్లబండి కృష్ణచారి, సత్యలక్ష్మీ, రాము, కుమార్ తదితరులు పాల్గొన్నారు


