ఇక.. సమరమే! | - | Sakshi
Sakshi News home page

ఇక.. సమరమే!

Feb 4 2026 8:23 AM | Updated on Feb 4 2026 8:23 AM

ఇక.. సమరమే!

ఇక.. సమరమే!

అన్ని పార్టీలు చివరిరోజే..

అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌, బీజేపీలతో పాటు సీపీఎం, సీపీఐ, టీఆర్‌పీల నుంచి ఆశావహులు సమయం ఎక్కువ లేకపోవడంతో మొదటగా నామినేషన్లు దాఖలు చేశారు. అనంతరం ఆయా పార్టీల వద్దకు వెళ్లి.. ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అయితే కాంగ్రెస్‌ పార్టీ సర్వేలతో అభ్యర్థులను గుర్తించగా.. బీఆర్‌ఎస్‌, బీజేపీలు సైతం గెలిచే అభ్యర్థుల కోసం వేచిచూశారు. ఈ క్రమంలోనే రాజకీయ సమీకరణలు, ఆర్థిక, ప్రజాబలం తదితర కోణాల్లో అభ్యర్థులను ఆయా పార్టీలు తేల్చాయి. సోమవారం అభ్యర్థులను ప్రకటించి.. మంగళవారం బీఫాంలు అందించారు. దీంతో మున్సిపల్‌ కార్యాలయాలు నామినేషన్లు ఉపసంహరించుకునే అభ్యర్థులతో పాటు బీఫాంలు సమర్పించే వారితో రద్దీగా మారాయి.

సాక్షి, యాదాద్రి : మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల లెక్క తేలింది. మంగళవారం సాయంత్రం వరకు నాటకీయ పరిణామాల మధ్య ఉపసంహరణలు కొనసాగాయి. జిల్లా వ్యాప్తంగా ఆరు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 104 వార్డుల్లో రెండు ఏకగ్రీవం కాగా 353 మంది బరిలో నిలిచారు. అత్యధికంగా భువనగిరిలో 128 మంది, అత్యల్పంగా యాదగిరిగుట్టలో 38 మంది పోటీలో ఉన్నారు. అభ్యర్థులు ఎవరో తేలడంతో ఇక ప్రచారం ఊపందుకోనుంది.

104 వార్డులకు రెండు ఏకగ్రీవం

జిల్లాలోని భువనగిరి, చౌటుప్పల్‌, పోచంపల్లి, యాదగిరిగుట్ట, ఆలేరు, మోత్కూరు మున్సిపాలిటీల్లోని 104 వార్డులకు జనవరి 29న ఎన్నికల నోటిఫికేషన్‌ ఇచ్చి అదేరోజు నుంచి నామినేషన్లు స్వీకరించారు. మూడు రోజుల్లో ఆశావహుల నుంచి మొత్తం 841 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆయా పార్టీలు తమకే టికెట్‌ ఇస్తాయని ఆశించినా.. పలు సమీకరణలతో సాధ్యం కాలేదు. దీంతో బుజ్జగింపుల పర్వం కొనసాగింది. ఈ నేపథ్యంలో మంగళవారం నామినేషన్ల ఉపసంహరణకు చివరి అవకాశం కావడంతో నేతల హామీలు, ప్రలోభాలు, బుజ్జగింపులు, బెదరింపులు... ఇలా అన్నిరకాల ప్రయత్నాలతో దిగివచ్చి మున్సిపల్‌ కార్యాలయాలకు క్యూకట్టి మధ్యాహ్నం మూడు గంటల లోగా నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. సాయంత్రం అధికారులు ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్ధుల జాబితాలను వెల్లడించారు. చౌటుప్పల్‌, యాదగిరిగుట్టలో ఒక్కో వార్డు చొప్పున ఏకీగ్రీవం కాగా ఇక 102 వార్డులకు 353 మంది బరిలోనిలిచారు. వీటికి ఈనెల 11న పోలింగ్‌ జరగనుంది.

బుజ్జగింపులు.. అలకలు..

మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో పట్టణాల్లో రాజకీయం వేడెక్కింది. ప్రధానంగా సోమవారం ఒక్కో పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తుండగా.. అప్పటి వరకు తమకే టికెట్‌ రానుందని ఆశించిన వారు నిరాశకు గురై అలకబూనారు. వీరిని బుజ్జగించేందుకు నేతలు రంగంలోకి దిగి కొన్నిచోట్ల ఎలాంటి వివాదాలు లేకుండా సద్దుమణిగేలా మంతనాలు చేశారు. నామినేషన్‌న్‌ దాఖలు చేసిన కొందరు తగ్గేది లేదని తేల్చి చెప్పి స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. యాదగిరిగుట్ట, చౌటుప్పల్‌లో తమ పార్టీ అభ్యర్థులను కొనుగోలు చేశారని బీఆర్‌ఎస్‌ ఆరోపించింది.

ఊపందుకోనున్న ప్రచారం..

మున్సిపల్‌ బరిలో నిలిచే అభ్యర్థులు ఖరారు కావడంతో ఎన్నికల ప్రచారం ఊపందుకోనుంది. పార్టీల గుర్తులే అభ్యర్థులకు రానుండడంతో ఓటర్ల వద్దకు క్యూకట్టనున్నారు. రాత్రింబవళ్లు ఓటర్లను కలిసేలా అభ్యర్థులు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ఎక్కువ సమయం లేకపోవడంతో ఉదయం, సాయంత్రం వేళల్లోనూ ప్రచారం చేయనున్నారు. తమ వార్డు పరిధిలో ఉన్న ఓటర్ల జాడను తెలుసుకునే పనిలో పడ్డారు. మద్యం పార్టీలు మొదలయ్యాయి.

బరిలో 353 మంది

ఫ అత్యధికంగా భువనగిరిలో 128 మంది, అత్యల్పంగా యాదగిరిగుట్టలో 38 మంది

ఫ ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ

ఫ 104 వార్డుల్లో చౌటుప్పల్‌, యాదగిరిగుట్టలో ఒక్కో వార్డు చొప్పున ఏకగ్రీవం

మున్సిపాలిటీ వార్డులు కాంగ్రెస్‌ బీఆర్‌ఎస్‌ బీజేపీ ఇతరులు మొత్తం

ఆలేరు 12 12 12 12 04 40

భువనగిరి 35 34 30 31 33 128

చౌటుప్పల్‌ 20 19 14 14 11 58

మోత్కూరు 12 11 11 12 15 49

పోచంపల్లి 13 13 13 11 03 40

యాదగిరిగుట్ట 12 10 10 11 07 38

మొత్తం 104 99 90 91 73 353

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement