హైస్పీడ్ ఉంటుందా?
పెండింగ్‌లోనే పలు రైల్వే ప్రాజెక్టులు
డోర్నకల్ టు గద్వాల అయ్యేనా
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : కేంద్ర బడ్జెట్‌లో ఉమ్మడి జిల్లాలోని కీలక రైల్వే ప్రాజెక్టులకు ఏ మేరకు నిధులు వస్తాయో నేడు తేలనుంది. ఆదివారం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఏటా బడ్జెట్ సమయంలో జిల్లాకు కావాల్సిన రైల్వే లైన్లు, రైళ్ల విస్తరణకు ఉమ్మడి జిల్లా ఎంపీలు విజ్ఞప్తులు చేస్తున్నా కేటాయింపులు పెద్దగా ఉండటం లేదు. ఈ సారైనా ఎంతమేర ప్రయోజనం చేకూరుతుందో అన్న అంచనాల్లో ప్రజలు ఉన్నారు.
శంషాబాద్ నుంచి విశాఖపట్నం హైస్పీడ్ రైల్వే కారిడార్‌కు కేంద్రం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ప్రిలిమినరీ ఇంజనీరింగ్ ట్రాఫిక్ (పెట్) సర్వేను నిర్వహించింది. ఇది ఆచరణలోకి వస్తే గంటకు 220 కిలోమీటర్ల వేగంతో నడిచే హైస్పీడ్ రైల్ శంషాబాద్ నుంచి సూర్యాపేట మీదుగా విశాఖపట్నానికి దాదాపు 4 గంటల్లో చేరుతుంది. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇప్పటివరకు రైల్వే కనెక్టివిటీ లేని వివిధ ప్రాంతాలకు రైల్వే సౌకర్యం ఏర్పడనుంది. ఒకలైన్ శంషాబాద్ నుంచి గట్టుప్పల్, చిట్యాల, నార్కట్‌పల్లి, నకిరేకల్, సూర్యాపేట జిలా కేంద్రం, కోదాడ, జగ్గయ్యపేట, విజయవాడ మీదుగా విశాఖపట్టణం చేరనుండగా, మరొక లైన్ విశాఖపట్టణం నుంచి విజయవాడ, జగ్గయ్యపేట, సూర్యాపేట, నల్లగొండ, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల మీదుగా కర్నూల్‌కు చేరేలా రైల్వే లైన్‌కు సర్వే చేపట్టింది. అయితే ఈ బడ్జెట్‌లో దానికి సంబంధించిన పనులకు నిధులను కేటాయించస్తుందా? లేదా? నేడు తేలనుంది.
హైదరాబాద్ – విజయవాడ మధ్యలో జాతీయ రహదారి వెంట రైల్ ప్రతిపాదనలకు కూడా ఏళ్లుగా మోక్షం లభించడం లేదు. గతంలో నల్లగొండ ఎంపీగా పని చేసిన మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పలుమార్లు కేంద్రానికి, రైల్వే బోర్డుకు, దక్షిణ మధ్య రైల్వేకు దీనిపై లేఖలు రాశారు. ఆ తరువాత వచ్చిన ఎంపీ కుందూరు రఘువీర్‌రెడ్డి కూడా జాతీయ రహదారి వెంట రైల్ మార్గం కావాలని కేంద్రాన్ని కోరారు. దీనికి సంబంధించిన సర్వేకు ఈసారైనా చర్యలు చేపడతారా? లేదా? చూడాల్సిందే.
ఘట్‌కేసర్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ ఫేజ్–2లో 33 కిలోమీటర్ల పొడవునా విస్తరించేందుకు చర్యలు చేపట్టినా ఇంతవరకు పనులు పూర్తి కాలేదు. వాటికి సంబంధించిన సమస్యలు పరిష్కరించాల్సి ఉంది. అలాగే ఎంఎంటీఎస్‌ను జనగామ వరకు పొడగించాలనే డిమాండ్‌పై ఇప్పటికై నా స్పందిస్తుందా? లేదా అన్నది తేలాల్సి ఉంది.
సికింద్రాబాద్ – యాదాద్రి–కాజిపేట మధ్య 3వ, 4వ లైన్లు 2026 జనవరిలో నోటిఫై అయ్యాయి. కానీ వాటికి సంబంధించిన పనులు ముందుకు సాగడం లేదు. వాటికి సంబంధించిన చర్యలు చేపట్టాల్సి ఉంది.
ఫ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు వచ్చేనా..
ఫ జాతీయ రహదారి వెంట రైలు కూత పెట్టేదెన్నడో
ఫ కలగానే శంషాబాద్–విశాఖపట్నం హైస్పీడ్ రైల్
యాదాద్రి భువనగిరి జిల్లాలో పలు రైల్వే ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయి. ముఖ్యంగా ఎంఎంటీఎస్ విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్డు వెంట రైల్‌కు ఏ మేరకు నిధులు ఇస్తుందో చూడాలి. 392 కిలోమీటర్ల పొడవునా యాదాద్రి భువనగిరి సహా పలు జిల్లాలను కలిపే ఈ రైల్వే లైన్ అంచనా ఖర్చు రూ.12,408 – రూ.24,000 కోట్లు. ప్రస్తుతం ఫైనల్ లొకేషన్ సర్వే, లిడార్ సర్వేలు జరుగుతున్నాయి. దానికి సంబంధించి కేంద్రం ఎలాంటి నిర్ణయం వెలువరించబోతుందన్నది నేడు తేలనుంది.
ఇప్పటికే డోర్నకల్ నుంచి గద్వాల వరకు కొత్త రైల్వే లైన్‌కు పైనల్ లొకేషన్ సర్వేకు (ఎఫ్‌ఎల్‌ఎస్) రైల్వే బోర్డు గతంలో ఆమోదం తెలిపింది. సూర్యాపేట, నల్లగొండ, నాగర్ కర్నూల్, వనపర్తి మీదుగా 296 కిలోమీటర్ల పొడవున డోర్నకల్– గద్వాల మధ్య కొత్త రైల్వే లైన్ ఏర్పాటు కోసం ఎఫ్‌ఎల్‌ఎస్ చేపట్టేందుకు గతంలో రూ.7.40 కోట్లు కేటాయించినట్లు పేర్కొంది. తప్ప విడుదల కాలేదు. ఇక మాచర్ల – నల్లగొండకు 92 కిలో మీటర్ల కొత్త రైల్వే లైన్‌ను రూ.458.26 కోట్లతో చేపట్టేందుకు ఎప్పుడో ఆమోదించిన కేంద్రం 2023 బడ్జెట్‌లో రూ.35.35 కోట్లు కేటాయించింది. అందులో రూ.11.30 లక్షలు ఖర్చు చేసింది. ఆ తరువాత నిధులు ఇవ్వలేదు.


