వీడని పులి భయం | - | Sakshi
Sakshi News home page

వీడని పులి భయం

Feb 1 2026 7:30 AM | Updated on Feb 1 2026 7:30 AM

వీడని పులి భయం

వీడని పులి భయం

తుర్కపల్లి అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం

పులి.. ఈ పేరు వింటేనే ప్రజలు వణికి పోతున్నారు. రెండు వారాలుగా తుర్కపల్లి మండల పరిధిలోని అటవీ ప్రాంతాల్లో సంచరిస్తూ కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఎప్పుడు ఏ ప్రాంతానికి వస్తుందో, ఎవరి మూగజీవాలపై దాడి చేస్తుందో అంతుచిక్కని పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. రైతులు వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. పులి సంచారం నేపథ్యంలో తుర్కపల్లి మండలంలోని ప్రభావిత గ్రామాలపై సాక్షి గ్రౌండ్‌ రిపోర్ట్‌.

తుర్కపల్లి: పులి సంచారం తుర్కపల్లి మండల పరిధిలోని అటవీ ప్రాంత పరిసర గ్రామాల్లో కలకలం రేపుతోంది. పశువులపై దాడి చేసి చంపుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. ఈనెల 17న తుర్కపల్లి మండలంలోని ఇబ్రహీంపురం గ్రామ శివారులో పులి సంచరించినట్టు ఆనవాళ్లు గుర్తించారు. అదేరోజు గ్రామంలో మాటూరి కృష్ణకు చెందిన లేగ దూడపై దాడి చేసి చంపింది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. పక్కపక్క పొలాల రైతులు కలిసి కర్రలు పట్టుకొని ఉదయం వ్యవసాయ బావుల వద్దకు వెళ్లి సాయంత్రం 4గంటల లోపే ఇళ్లకు చేరుకుంటున్నారు. బావులు, రహదారుల వెంట ఏదైనా అలికిడి జరిగినట్లు సమాచారం వస్తే వెంటనే సుమారు 20 మంది యువకులు కలిసి కర్రలతో వెళ్లి చూసివస్తున్నారు.

ఊరి బయట పహారా

ఈనెల 20, 21 తేదీల్లో దత్తాయిపల్లి శివారులో రైతు గొట్టి శ్రీశైలానికి చెందిన లేగదూడతో పాటు రెండు ఆవులను చంపింది. పులిసంచరిస్తోంది.. బావుల వద్దకు వెళ్లవద్దని గ్రామంలో సర్పంచ్‌ కరుణాకర్‌ టాంటాం వేయించాడు. అడవులకు దగ్గరగా ఉన్న బావుల వద్దకు ఐదారుగురు రైతులు కలిసి వెళ్తున్నారు. రైతులు బావుల వద్దకు వెళ్ల కుండా సాయంత్రం 5గంటల నుంచి ఆరు గంటల వరకు గ్రామ సమీపంలోని రహదారి వెంట సర్పంచ్‌, యువకులు పహారా కాస్తున్నారు. అటవీ అధికారులు రోజూ వచ్చి పర్యవేక్షణ చేస్తున్నారు.

మధ్యాహ్నం 3గంటలైతే బయటికి రాని జనం

తిరుమలపురంలో నాలుగు రోజుల క్రితం ఐనాల మహేందర్‌రెడ్డి బావి వద్ద పులి పాదముద్రలు గుర్తించిన గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు వచ్చి పులి కాలిగుర్తులే అని నిర్ధారించారు. అస్మాయికుంటు గుట్టల్లో పులి ఉండొచ్చని తిరుమలపురం, శ్రీనివాసపురం, కొండాపురంలలో అధికారులు టాంటాం వేయించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు మధ్యాహ్నం 3గంటలు అయ్యిందంటే ఎవరూ ఇళ్లనుంచి బయటి రావడంలేదు. పశువులను పొలాల నుంచి ఇళ్ల వద్దకే తీసుకొస్తున్నారు.

ఫ ఇప్పటికే పులి దాడిలో రెండేసి ఆవులు, లేగదూడల మృతి

ఫ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న జనం

ఫ ఐదారుగురు కలిసి పొలాల వద్దకు వెళ్తున్న రైతులు

ఫ సాయంత్రం అయ్యిందంటే గడపదాటని వైనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement