కమణీయం.. పూర్వగిరీశుడి కల్యాణం
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న పూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి స్వామివారి కల్యాణోత్సవాన్ని అర్చకులు వైభవంగా జరిపించారు. గజవాహనంపై స్వామివారిని, ప్రత్యేక పల్లకీపై శ్రీలక్ష్మి అమ్మవారిని అధిష్ఠించి ఆలయ పురవీధుల్లో ఊరేగిస్తూ కల్యాణ మండపానికి తీసుకొచ్చి కల్యాణ తంతు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆలయ ఈఓ భవానీ శంకర్, అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తి, డిప్యూటీ ఈఓ భాస్కర్‌శర్మ, ఆలయాధికారులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఉదయం హనుమంత వాహనంపై...
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం 8గంటలకు నిత్య ప్రబంధ పారాయణములు, నిత్య హవనములు, మూల, మూర్తిమంత్ర అనుష్టానములు, హవనం పూజలు జరిపించారు. అనంతరం స్వామి, అమ్మవారికి తిరుమంజన మహోత్సవం నిర్వహించారు. కల్యాణమూర్తులైన లక్ష్మీనరసింహస్వామి, అమ్మవారిని ఆలయ పుర వీధుల్లో హనుమంత వాహనంపై ఊరేగించారు. ఆస్థాన మండపంలో హనుమంత వాహనంపై అధిష్టింపజేసి ప్రత్యేక పూజలు చేశారు.
నేడు రథోత్సవం..
ఆదివారం ఉదయం 8గంటలకు హవనం పూజలు నిర్వహిస్తారు. అనంతరం గరుడ వాహనంపై స్వామివారిని ఊరేగిస్తారు. రాత్రి 8గంటలకు రథోత్సవం జరిపించనున్నారు.
ఫ హనుమంత వాహనంపై స్వామి ఊరేగింపు
ఫ నేడు దివ్య విమాన రథోత్సవం
కమణీయం.. పూర్వగిరీశుడి కల్యాణం
కమణీయం.. పూర్వగిరీశుడి కల్యాణం


