బాధ్యతాయుతంగా వ్యవహరించాలి
భువనగిరిటౌన్ : మున్సిపల్ ఎన్నికల విధుల్లో ప్రిసైడింగ్ అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. శుక్రవారం భువనగిరి కలెక్టరేట్‌లో ప్రిసైడింగ్ అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులకు అదనపు కలెక్టర్ భాస్కర్‌రావుతో కలిసి కలెక్టర్ హాజరై మాట్లాడారు. ఎన్నికల డ్యూటీలు వేసిన ప్రతిఒక్కరూ విధుల్లో చేరాలని ఎవరికీ కూడా మినహాయింపు ఉండదన్నారు. పోలింగ్ సామగ్రిని ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించి బాలెట్ పేపర్స్, పోలింగ్ బాక్సులు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలన్నారు. ప్రధానంగా పోలింగ్ బాక్స్ ఓపెన్ చేయడం, సీల్ వేసే విషయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. పోలింగ్ ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారి సత్యనారాయణ, మాస్టర్ ట్రైనర్ నర్సిరెడ్డి, ప్రిసైడింగ్ అధికారులు పాల్గొన్నారు.
మీడియాకు సమాచారం అందించాలి
మున్సిపల్ ఎన్నికల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా సెంటర్ ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు అందించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హనుమంతరావు అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ (ఎంసీఎంసీ)ను అదనపు కలెక్టర్ భాస్కర్‌రావుతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డీపీఆర్‌ఓ శ్రీమతి అరుంధతి, సిబ్బంది పాల్గొన్నారు.


