బార్ కౌన్సిల్ ఎన్నికలు ప్రశాంతం
భువనగిరిటౌన్, చౌటుప్పల్ : తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం భువనగిరి జిల్లా కోర్టు ఆవరణలో ఓటింగ్ నిర్వహించారు. జిల్లాలో రామన్నపేట, ఆలేరు, చౌటుప్పల్, యాదగిరిగుట్ట బార్ అసోసియేషన్లలో మొత్తం 265 న్యాయవాదులు ఓటర్లుగా ఉండగా 252 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర బార్ కౌన్సిల్లో 23 పోస్టులకు 203 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. భువనగిరిలో ప్రధాన జూనియన్ సివిల్ జడ్జి గేడం స్వాతి ఎన్నికలను పర్యవేక్షించారు. ఎన్నికల అధికారిగా జిట్టా భాస్కర్‌రెడ్డి, సహాయకులుగా శివకిరణ్, బొడ్డు కిషన్ విధులు నిర్వహించారు. జడ్జి స్వాతి పర్యవేక్షణలో బ్యాలెట్ బాక్సులను సీల్ చేసి రాష్ట్ర బార్ కౌన్సిల్‌కు పంపించారు. అలాగే చౌటుప్పల్‌లో జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో జరిగిన ఓటింగ్‌లో 39మంది ఓటర్లు ఉండగా 37మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల అధికారిగా పడమటి మహిపాల్‌రెడ్డి వ్యవహరించగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బాల్యం వెంకటాచలపతి పర్యవేక్షించారు.


