22న సర్పంచ్‌ల ప్రమాణస్వీకారం
427 పంచాయతీల్లో కొలువుదీరనున్న పాలక వర్గాలు
యాదగిరిగుట్ట రూరల్, రాజాపేట : జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ భవనాలు ముస్తాబవుతున్నాయి. ఈనెల 22న నూతన పాలకవర్గాలు ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించనున్నాయి. ఈ నేపథ్యంలో పంచాయతీ భవనాలకు రంగులు వేసి, నూతన ఫర్నిచర్‌తో సిద్ధం చేస్తున్నారు. సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల పేర్లను భవనాల గోడలపై రాస్తున్నారు.
భువనగిరిటౌన్ : జిల్లాలో నూతనంగా ఎన్నికై న పంచాయతీ పాలకవర్గాలు కొలువుదీరేందుకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 22న కొత్త సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డుసభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ముందుగా ఈ నెల 20న ప్రమాణస్వీకారం చేయించాలని నిర్ణయించగా, ముహూర్తం బాగాలేదని సర్పంచ్‌ల విజ్ఞప్తుల మేరకు తేదీలో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మూడు విడతల్లో ఎన్నికై న సర్పంచ్‌లు, వార్డు సభ్యులంతా ఒకే రోజు 22వ తేదీన ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ రోజు నుంచి ఐదేళ్ల కాలపరిమితతో నూతన పాలకవర్గాలు కొనసాగనున్నాయి.
పంచాయతీలు, వార్డులు ఇలా..
పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం 2024 ఫిబ్రవరి మొదటి వారంలో ముగిసింది. అప్పటినుంచి ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. ఎట్టకేలకు ఎన్నికల ప్రక్రియ ముగియడంతో నూతన పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టనున్నాయి. జిల్లాలో 427 గ్రామ పంచాయతీలు, 3,704 వార్డులకు మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. కొత్త పాలకవర్గాల ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు బుధవారం ఒక ప్రకటనలో సంబంధిత అధికారులను ఆదేశించారు.


