ప్రసాదంలో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రసాదంలో నాణ్యత లోపిస్తే సంబంధిత అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు ఉంటాయని ఈఓ వెంకట్రావ్ హెచ్చరించారు. ఆదివారం ప్రసాద విభాగాన్ని, టిక్కెట్ కౌంటర్లను, డోనర్ సెల్, కియోస్క్ మిషన్లను ఈఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రసాదం నాణ్యతపై, టిక్కెట్ కౌంటర్ల నిర్వహణపై భక్తుల అభిప్రాయాలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రసాదం నాణ్యత ఎల్లప్పుడూ ఉన్నతంగా ఉంచాలని సూచించారు. భక్తుల అభిప్రాయం మేరకు అసరమైన చోట్ల టిక్కెట్ స్కానింగ్ విధానాన్ని మరింతగా మెరుగుపరుస్తామన్నారు. భక్తుల సౌకర్యార్ధం బస్టాండ్ ప్రాంతంలో మరో కొత్త కియోస్క్ యంత్రాన్ని ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. డోనర్ సెల్ ద్వారా భక్తులకు దేవాలయంలోని అన్ని పథకాలు, వాటి లాభాలను స్పష్టంగా, మర్యాదపూర్వకంగా వివరించాలని తెలిపారు. ఆలయంలో భవిష్యత్తులో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, లోపాలు లేకుండా చూసుకునే బాధ్యత ఆయా విభాగాలకు సంబంధించిన అధికారులదేనని వెల్లడించారు. అనంతరం ఆలయ మాడ వీధుల్లో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన వెంట డిప్యూటీ ఈఓ దోర్భాల భాస్కర్‌శర్మ, ఈఈ దయాకర్‌రెడ్డి, అధికారులు నవీన్‌కుమార్, జి. రఘు ఉన్నారు.
ఫ యాదగిరిగుట్ట ఆలయ ఈఓ వెంకట్రావ్


