నవోదయ ప్రవేశ పరీక్షకు 74.71 శాతం హాజరు
పెద్దవూర : మండలంలోని చలకుర్తి క్యాంపు జవహర్ నవోదయ విద్యాలయంలో (జేఎస్‌వీ) 2026–27 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాలకు గాను శనివారం నిర్వహించిన ప్రవేశపరీక్షకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 74.71 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు ప్రిన్సిపాల్ శంకర్ తెలిపారు. మొత్తం 80 సీట్లకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష కోసం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 26 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా 4,338 మంది విద్యార్థులకుగాను 3241 మంది పరీక్షకు హాజరైనట్లు వెల్లడించారు. దీంతో ఒక్క సీటుకు 40 మంది విద్యార్థులు పోటీ పడుతున్నారని తెలిపారు. అన్ని కేంద్రాల్లో పరీక్ష ప్రశాంతంగా సాగిందని పేర్కొన్నారు.
విజయోత్సవాలు నిర్వహించొద్దు
భువనగిరిటౌన్ : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు, వారి అనుచరులు గానీ ఎవరైనా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదని కలెక్టర్ హనుమంతరావు శనివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఫలితాలు ముగిసిన వెంటనే ర్యాలీలు తీయడం ఎన్నికల నియమావళికి విరుద్ధమన్నారు. మూడో విడత ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగిసే వరకు కోడ్ అమల్లో ఉంటుందన్నారు. నియమావళిని ఉల్లంఘిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆదివారం రెండో విడత, 14న మూడో దశ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
సమస్యాత్మక గ్రామాల్లో పోలీసుల కవాతు
రామన్నపేట : రెండో విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు శనివారం పలు గ్రామాల్లో కవాతు నిర్వహించారు. రామన్నపేట మండలంలోని అత్యంత సమస్యాత్మక గ్రామాలైన ఇంద్రపాలనగరం, వెల్లంకి, సిరిపురంలో ఎస్‌ఐ నాగరాజుల ఆధ్వర్యంలో రిజర్వ్ పోలీసు బలగాలు కవాతు నిర్వహించాయి. ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని ఎస్‌ఐ కోరారు.
ఆకట్టుకున్న నృత్యాలు
భువనగిరి : భువనగిరి మండలం రాయగిరి మినీ శిల్పారామంలో శనివారం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. హైదరాబాద్‌కు చెందిన మీరా నాట్య గురువు పూజిత శిష్య బృందం భరత నాట్యం ప్రదర్శించి అలరించారు. తమ అభినయంతో సందర్శకులను మొప్పించారు. కార్యక్రమంలో కళాకారిణిలు తరుణి అరుషి, భావిక, నిహిత, తనస్వి, వైష్ణవి, శరత్ తదితరులు పాల్గొన్నారు.
పంచనారసింహుడి క్షేత్రంలో నిత్యారాధనలు
యాదగిరిగుట్ట: పంచనారసింహుడి క్షేత్రంలో శనివారం సంప్రదాయ పర్వాలను అర్చకులు శాస్త్రోక్తంగా చేపట్టారు. వేకువజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి, గర్భాలయంలో కొలువైన స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులను అభిషేకం, సహస్రనామార్చనతో కొలిచారు. అనంతరం ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, ఆ తరువాత గజవాహనసేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో అష్టోత్తర, సువర్ణ పుష్పార్చన తదితర పూజలు జరిపించారు. సాయంత్రం స్వామివారి వెండి జోడు సేవను ఆలయంలో భక్తుల మధ్య ఊరేగించారు. రాత్రి శ్రీస్వామి, అమ్మవార్లకు శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు.
నవోదయ ప్రవేశ పరీక్షకు 74.71 శాతం హాజరు


