స్వేచ్ఛగా ఓటేయండి : కలెక్టర్
భువనగిరి, రామన్నపేట, వలిగొండ : ప్రజలందరూ స్వేచ్ఛగా, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు ఓటర్లకు పిలుపునిచ్చారు. భువనగిరి, రామన్నపేట, వలిగొండలో ఏర్పాటు చేసిన రెండో విడత పంచాయతీ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను ఆయన సందర్శించారు.పోలింగ్ సిబ్బందికి పోలింగ్ సామగ్రి పంపిణీ ప్రక్రియను పరిశీలించారు.ఎన్నికలు పారదర్శకంగా, పొరపాట్లకు తావులేకుండా నిర్వహించేందుకు ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పని చేయాలని ఆదేశించారు. చెక్‌లిస్టు ప్రకారం ముందుగానే ఎన్నికల సామగ్రిని పరిశీలించుకోవాలని సిబ్బందికి సూచించారు. ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత బ్యాలెట్ పేపర్లను బ్యాలెట్ బాక్సులో వేశారా, లేదా గమనించాలన్నారు. పోలింగ్ విధులకు హాజరు కాని ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తప్పవన్నారు.
ఫలితాలు వెల్లడించగానే
ఉపసర్పంచ్ ఎన్నిక నిర్వహించాలి
ఎన్నికల ఫలితాలు వెల్లడించిన వెంటనే ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించాలని రిటర్నింగ్ అధికారులకు స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల నుంచి తిరిగి బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూంలకు తరలించే వరకు బందోబస్తు ఉండేలా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అనంతరం పోలింగ్ సిబ్బందికి భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జిల్లా విజిలెన్స్ అధికారి మందడి ఉపేందర్‌రెడ్డి, డీఆర్‌డీఓ నాగిరెడ్డి, ఎండీపీడీఓలు శ్రీనివాస్, రాములు, జలందర్‌రెడ్డి, తహసీల్దార్లు అంజిరెడ్డి, లాల్‌బహుదూర్‌శాస్త్రి, దశరథ, ఎంఈఓ నాగవర్థన్‌రెడ్డి, ఎంపీఓలు కేదారేశ్వర, అంజుమన్ భాను, ఆర్‌ఐలు శోభ తదితరులు పాల్గొన్నారు.


