పెరిగిన రద్దీ.. పరిమితికి మించి ప్రయాణం
భువనగిరి: మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సులు కిక్కిరుస్తున్నాయి. పల్లెవెలుగులు, ఎక్స్‌ప్రెస్‌లలో రద్దీ విపరీతంగా పెరిగింది. సీట్ల సామర్థ్యానికి రెట్టింపు సంఖ్యలో ప్రయాణిస్తున్నారు. కానీ, అందుకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచకపోవడంతో మూలమలుపులు, అధ్వానంగా ఉన్న రహదారులపై ప్రమాదకరంగా ఉంటుందని ప్రయాణికులు అంటున్నారు. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసేందుకు డ్రైవర్లు భయాందోళన చెందుతున్నారు.ప్రాణాలు అరచేతిలో పట్టుకొని బస్సును నడపాల్సి వస్తుందని వాపోతున్నారు.
ఒక్కో బస్సులో
వంద మంది వరకు ప్రయాణం
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సు డిపోలు ఏడు ఉన్నాయి. ఆయా డిపోల పరిధిలో 700కు పైగా బస్సులు ఉన్నాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సైతం నిత్యం వేలాది మందిని చేరవేస్తుంటాయి. నిబంధనల ప్రకారం బస్సులో 50 నుంచి 60 మంది ప్రయాణం చేయాలి. కానీ, ఒక్కో బస్సులో 70 మందికి పైగా ప్రయాణిస్తున్నారు.
స్వగ్రామాలకు తరలివస్తున్న జనం
సాధారణ రోజుల్లో ఉదయం, సాయంత్రం సమయాల్లో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటుంది. వరుస సెలవులు, పండుగల సమయంలో ఆ సంఖ్య పెరుగుతుంది. ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా బస్సుల్లో కాలుపెట్టే వీలు లేకుండా ఉంటున్నాయి. హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజానీకం ఓటు వేసేందుకు స్వగ్రామాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ప్రతి బస్సు ప్రయాణికులతో కిక్కిరిసి వెళ్తుంది. ఏ బస్సులో చూసినా 100 మంది వరకు ప్రయాణికులు ఉంటున్నారు. ఫుట్‌బోర్డులో ప్రమాదకర ప్రయాణం చేయాల్సి వస్తుందని, బస్సుల సంఖ్య పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ప్రయాణికులతో కిక్కిరిస్తున్న ఆర్టీసీ బస్సులు
ఫ ఎన్నికల వేళ విపరీతంగా పెరిగిన రద్దీ
ఫ సర్వీసులు పెంచని అధికారులు
ఫ మూలమలుపులు, గతుకుల రోడ్లపై భయాందోళన
పెరిగిన రద్దీ.. పరిమితికి మించి ప్రయాణం


