గడపగడపకూ తాయిలాలు
సాక్షి, యాదాద్రి: రెండవ విడత ఎన్నికలు జరిగే పంచాయతీల్లోనూ ప్రలోభాల పర్వం జోరుగా సాగుతోంది. శుక్రవారం సాయంత్రం మొదలైన డబ్బులు, మద్యం, మాంసం, ఇతర తాయిలాల పంపిణీ శనివారం అర్ధరాత్రి వరకు కూడా కొనసాగింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు బలపరిచిన అభ్యర్థులు పోటీపడి పంపకాలు చేపట్టారు. ముఖ్యంగా హెచ్‌ఎండీఏ మండలాల్లోని పంచాయతీల్లో సర్పంచ్‌లు, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రతి ఓటును కీలకంగా భావిస్తున్నారు. ఇక్కడ రియల్‌ఎస్టేట్ వ్యాపారం, వివిధ రకాల పరిశ్రమలు విస్తరించి ఉండటంతో హోరాహోరీగా తలపడుతున్నారు. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడటం లేదు.
ఈ పంచాయతీల్లో నోట్ల వర్షం
పోచంపల్లి మండలం దేశ్‌ముఖ్, పిలాయపల్లి, అంతమ్మగూడెం, దోతిగూడెం, ఇంద్రియాల, జూలూరు, బీబీనగర్ మండలంలో కొండమడుగు, రాఘవాపురం, బీబీనగర్, రామన్నపేట మండలం సిరిపురం, వెల్లంకి, రామన్నపేట, ఇంద్రపాలనగరం, పల్లివాడ, బోగారం, సర్నేనిగూడెం, వలిగొండ, వేములకొండ, అర్రూర్, గోకారం, రెడ్లరేపాక, టేకులసోమారం, పహిల్వాన్‌పురం, భువనగిరి మండలం తాజ్‌పూర్, బండసోమారం, బొల్లేపల్లి, వడాయిగూడెం, నాగిరెడ్డిపల్లి, నందనంలో ఓటర్లకు నోట్ల వర్షం కురుస్తోంది. దేశ్‌ముఖిలో ఓటుకు రూ.33వేల వరకు వస్తున్నట్లు తెలిసింది. ఇక్కడ ఒకే సామాజిక వర్గానికి చెందిన నలుగురు పోటీ చేస్తున్నారు. అంతమ్మగూడెంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు పోటీ పడుతున్నారు. గెలిపిస్తే గ్రామ దేవతల గుడికి రూ.కోటి విలువ చేసే ఎకరం భూమి ఇస్తామని బాండ్ రాసిచ్చారు.
యువత, వలస ఓట్లే కీలకం
మొదటి దశ ఎన్నికల్లో పలు పంచాయతీల్లో యువత, వలస ఓటర్లు అభ్యర్థుల విజయావకాశాలపై ప్రభావం చూపారు. మలి విడతలోనూ చాలా చోట్ల వారే కీలకంగా మారనున్నారు.దీంతో వారి ఓట్లను రాబట్టుకునే వివిధ రాజకీయ పార్టీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. కొందరు అభ్యర్థులు ముందు రోజే ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేసి వలస ఓటర్లను ఊర్లకు రప్పించారు. మరికొందరు దావత్‌లు, రానుపోను చార్జీలు, ఓటుకు నోట్లు ముట్టజెప్పారు. హైదరాబాద్‌లో ఉంటున్న ఓటర్లు ఇప్పటికే గ్రామాలకు చేరుకోగా.. మరికొందరు ఆదివారం ఉదయం వచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇక యువతకు పెద్ద ఎత్తున దావత్‌లతో పాటు భారీగా నగదు ముట్టజెపుతున్నట్లు తెలుస్తోంది. గెలిచిన తరువాత వారి డిమాండ్లు నెరవేర్చేందుకు హామీలు ఇస్తున్నారు.
ఫ రెండు రోజులుగా నిరంతరాయంగా ప్రలోభాలు
ఫ డబ్బు, మద్యం, మాంసం, చీరలు, ఇతర గిఫ్టులు..
ఫ పోటీపడి పంపిణీ చేస్తున్న అభ్యర్థులు
రెండు, మూడు దఫాలు నగదు
రామన్నపేట: మండలంలోని పలు పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున అభ్యర్థులు ఓటర్లకు రెండు, మూడు దఫాలు నగదు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. ఓటుకు రూ.500 నుంచి రూ.3వేల వరకు ముట్టచెప్పినట్లు సమాచారం. అదనంగా మద్యం, చికెన్, చీరలు ఇతర కానుకలు పంపిణీ చేశారు. ఓ పంచాయతీలో స్టూల్ గుర్తు వచ్చిన వార్డు సభ్యుడు ఏకంగా ఫైబర్ స్టూల్స్ తయారు చేయించి పంపిణీ చేసినట్లు సమాచారం.ఉపసర్పంచ్ ఆశావాహులు సైతం ఖర్చుకు వెనుకాడడం లేదు.


