గోవులను తరలిస్తున్న కంటెయినర్ పట్టివేత
చౌటుప్పల్: అక్రమంగా గోవులను తరలిస్తున్న కంటెయినర్‌ని బుధవారం చౌట్పుల్ పోలీసులు పట్టుకున్నారు. ఏపీలోని విశాఖపట్నంలో 82 గోవులు, ఎద్దులను కొనుగోలు చేసి కంటెయినర్ కంటెయినర్‌లో హైదరాబాద్‌లోని బహదూర్‌పురకు తరలిస్తుండగా.. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం గ్రామ శివారులో హైవే–9 హోటల్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. డ్రైవర్ తప్పించుకున్నాడు. గోవులు, ఎద్దులను పోలీసులు చల్లూరులోని గోశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కండక్టర్‌పై దాడి..
ఇద్దరిపై కేసు నమోదు
చౌటుప్పల్ రూరల్: ఆర్టీసీ బస్సు కండక్టర్‌పై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసినట్లు చౌటుప్పల్ సీఐ మన్మథకుమార్ తెలిపారు. దిల్‌సుఖ్‌నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మంగళవారం చౌటుప్పల్‌కు వస్తుండగా.. మార్గమధ్యలో ఓ మహిళ బస్సు ఆపమని డ్రైవర్‌ను కోరింది. అయితే డ్రైవర్ బస్సు ఆపకుండా చౌటుప్పల్ బస్టాండ్‌కు తీసుకొచ్చాడు. దీంతో మహిళ తన భర్త, కుమారుడికి జరిగిన విషయం చెప్పగా.. వారు చౌటుప్పల్ బస్టాండ్‌కు వచ్చి బస్సు కండక్టర్ గోశిక దయానంద్‌పై దాడి చేశారు. కండక్టర్ ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన పొగడ్త వీరస్వామి, ప్రవీణ్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.
చికిత్స పొందుతూ మృతి
నాగారం: సూర్యాపేట–జనగామ జాతీయ రహదారిపై నాగారం బంగ్లా వద్ద ఈ నెల 15న పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా అతివేగంతో దూసుకొచ్చిన కారు ఢీకొని కానిస్టేబుల్ శీలం కమలాకర్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఇదే ఘటనలో గాయపడిన ఆత్మకూర్(ఎస్) మండలం ఏనెబాముల గ్రామానికి చెందిన మాజీ కానిస్టేబుల్ పెరుమాళ్ల అశోక్ (40) హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతుడికి భార్య ఉంది. అంతేకా కుండా ఇదే ప్రమాదంలో గాయపడిన సామాజిక కార్యకర్త యాతాకుల సునీల్‌కు చేయి విరగడంతో ప్రస్తుతం సూర్యాపేట జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సీఐ నాగేశ్వర్‌రావు తెలిపారు.
కారును ఢీకొట్టిన
సిమెంట్ లారీ, బైక్
ఫ ఇద్దరికి గాయాలు
చౌటుప్పల్ రూరల్: హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారును వెనుక నుంచి సిమెంట్ లారీ, బైక్ ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన చౌటుప్పల్ మండలం ఎల్లగిరి గ్రామ స్టేజీ వద్ద బుధవారం ఉదయం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన ఓ కుటుంబం కారులో నల్లగొండకు వెళ్తున్నారు. మార్గమధ్యలో చౌటుప్పల్ మండలం ఎల్లగిరి సమీపంలోకి రాగానే వెనుక నుంచి వస్తున్న సిమెంట్ లారీ కారును ఢీకొట్టి వెళ్లింది. దీంతో కారు రోడ్డు మధ్యలో డివైడర్ పైకి ఎక్కింది. అదే సమయంలో మహబూబ్‌నగర్ జిల్లా కందుర్గ మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన కావలి శేఖర్, వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం రుద్రారం గ్రామానికి చెందిన దేవిగారి గౌతంరాజు కలిసి బైక్‌పై ఖమ్మంకు వెళ్తూ కారును వెనుక నుంచి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో శేఖర్‌కు తీవ్ర గాయాలు కాగా, గౌతంరాజుకు స్వల్ప గాయాలయ్యాయి. కారులో ఉన్న వారికి ఎలాంటి గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ సీఐ విజయ్‌మోహన్ ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆటోలో చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శేఖర్‌ను మెరుగైన వైద్యం కోసం చేవెళ్లలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని చౌటుప్పల్ సీఐ మన్మథకుమార్ తెలిపారు.
గోవులను తరలిస్తున్న కంటెయినర్ పట్టివేత


