‘బీఎస్‌ఎన్‌ఎల్’ కేసులో మరో ఇద్దరు అరెస్ట్
నల్లగొండ: బీఎస్‌ఎన్‌ఎల్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో నుంచి రూ.20 కోట్లు దుర్వినియోగం చేసిన కేసులో ఈ ఏడాది మే నెలలో క్రెడిట్ సొసైటీ అధ్యక్షుడు భిక్షంతో పాటు అనంతరావును సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం విచారణను వేగవంతం చేసిన సీఐడీ పోలీసులు రెండు రోజుల క్రితం మరో ఇద్దరు క్రెడిట్ సొసైటీ సభ్యులు ఎం. రవిప్రసాద్, వి. సత్యనారాయణను అరెస్టు చేశారు.
పొదుపు పేరిట దోపిడీ..
నల్లగొండలోని బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగులంతా కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని ఏర్పాటు చేసుకున్నారు. దానికి కార్యవర్గాన్ని కూడా నియమించుకుని ఉద్యోగులంతా ఎంతైనా పొదుపు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఉద్యోగంలో ఉన్నప్పుడు క్రెడిట్ సొసైటీలో పొదుపు చేసుకుంటే రిటైర్ అయ్యాక ఇంటి నిర్మాణం, పిల్లల చదువుకు, వృద్ధాప్యంలో అవసరం వస్తాయని క్రెడిట్ సొసైటీ సభ్యులు చెప్పడంతో వందలాది మంది బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగులు కోట్ల రూపాయలు పొదుపు చేశారు. ఈ క్రమంలో రిటైర్ అయిన కొందరు ఉద్యోగులు క్రెడిట్ సొసైటీలో పొదుపు చేసిన తమ డబ్బులు తీసుకోవడానికి వెళ్లగా అధ్యక్ష, కార్యదర్శులతో పాటు సభ్యులు రేపుమాపు అంటూ కాలయాపన చేస్తూ వచ్చారు. క్రెడిట్ సొసైటీలో రూ.20 కోట్లు దుర్వినియోగం అయినట్లు గుర్తించిన పలువురు రిటైర్డ్ ఉద్యోగులు క్రెడిట్ సొసైటీ మీద 2022కి ముందే కేసు పెట్టారు. కానీ బాధితులకు న్యాయం జరగలేదు. దీంతో బాధితులంతా కలిసి మరోసారి 2022 ఏప్రిల్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును పోలీసు శాఖ సీఐడీకి అప్పగించింది. అప్పటి నుంచి సీఐడీ పోలీసులు విచారణ ప్రారంభించారు. ఎంప్లాయిస్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో పొదుపు చేసిన సభ్యులకు నకిలీ బాండ్లు ఇచ్చి వారి డబ్బులు కాజేశారని తేలడంతో సొసైటీ ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన రిటైర్డ్ సూపరింటెండెంట్ బాసమల్ల అనంతరావును పోలీసులు అరెస్టు చేశారు. దీంతో కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ అధ్యక్షుడు భిక్షంతో పాటు సొసైటీ సభ్యులు పరారయ్యారు. ఆ తర్వాత భిక్షాన్ని కూడా సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. రెండు రోజుల క్రితం ఏపీలోని విజయవాడలో ఏజీఎం ఎం. రవిప్రసాద్‌తో పాటు రిటైర్డ్ సూపరింటెండెంట్ సత్యనారాయణను అరెస్టు చేసినట్లు హైదరాబాద్ సీఐడీ అధికారులు వెల్లడించారు.
ఫ ఉద్యోగుల కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ నుంచి రూ.20 కోట్లు దుర్వినియోగం
ఫ గతంలోనే ఇద్దరిని అదుపులోకి
తీసుకున్న సీఐడీ పోలీసులు


