ముగిసిన పుష్కర వారోత్సవాలు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట పట్టణంలోని శ్రీమణిద్వీపేశ్వరి విశ్వజననీ పరాశక్తి పీఠం, శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో పుష్కర వారోత్సవాలు శుక్రవారం ముగిశాయి. ఈ సందర్భంగా ఉదయం ఆలయంలో పూజారులు నిత్య పూజలు నిర్వహించారు. అనంతరం రుద్ర హోమం, చండీ సప్తశతి హవనం, కుంభాభిషేకం, నివేదన, ధ్వజారోహణం, మహాపూర్ణాహుతి జరిపించారు. ఈ పూజల్లో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య దంపతులు పాల్గొన్నారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయా వేడుకల్లో ఆలయ నిర్వాహకులు పాల్గొన్నారు.
విడాకుల కోసం వచ్చిన
జంటను కలిపిన కోర్టు
హుజూర్‌నగర్: విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్న జంట శుక్రవారం హుజూర్‌నగర్ కోర్టులో సూర్యాపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి. లక్ష్మీశారద సమక్షంలో తిరిగి ఒక్కటయ్యారు. వివరాలు.. హుజూర్‌నగర్‌కు చెందిన కొత్తపల్లి వెంకటేష్‌కు తన భార్య శ్రీలతతో మనస్పర్ధలు రావడంతో విడాకుల కోసం స్ధానిక కోర్టును ఆశ్రయించాడు. దీంతో కోర్టు శ్రీలతకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విచారణలో ఉండగా ప్రత్యేక లోక్‌అదాలత్‌లో వెంకటేష్, శ్రీలత కలిసి న్యాయమూర్తి కౌన్సెలింగ్‌తో ఒక్కటయ్యారు. లోక్ అదాలతో పరిష్కారం కొరకు అడ్వకేట్ జక్కుల వీరయ్య ద్వారా దరఖాస్తు చేయడంతో శుక్రవారం ఆ జంటకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి. లక్ష్మీశారద శుభాకాంక్షలు తెలియజేస్తూ కోర్టులో ఇరువురితో దండలు మార్పించారు. స్వీట్లు పంపిణీ చేసి అనంతరం వారి చేత కోర్టు ప్రాంగణంలో మొక్క నాటించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. పాత జ్ఞాపకాలను మరిచి నూతన జీవితాన్ని ప్రారంభించాలన్నారు. పిల్లాపాపలతో జీవింతాంతం సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మారుతీ ప్రసాద్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి అయేషా షరీన్, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
వ్యభిచార గృహంపై పోలీసుల దాడి
● నలుగురి అరెస్ట్
మిర్యాలగూడ అర్బన్: మిర్యాలగూడ పట్టణంలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై వన్‌టౌన్ పోలీసులు శుక్రవారం దాడి చేసి నలుగురిని అరెస్ట్ చేశారు. వన్‌టౌన్ ఎస్‌ఐ సైదిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని రెడ్డికాలనీలో నివాసముంటున్న షేక్ ఫాతిమా, రెడ్డబోయిన మణి అలియాస్ సంధ్య వ్యభిచారం నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు వన్‌టౌన్ పోలీసులు దాడి చేసి నిర్వాహకులతో పాటు ఒక మహిళ, విటుడిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మూడు సెల్‌ఫోన్లు, రూ.1000 నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సైదిరెడ్డి తెలిపారు.
ముగిసిన పుష్కర వారోత్సవాలు


