బత్తాయి కాయల్లో మంగు.. నివారణ చర్యలు | - | Sakshi
Sakshi News home page

బత్తాయి కాయల్లో మంగు.. నివారణ చర్యలు

Nov 15 2025 7:17 AM | Updated on Nov 15 2025 7:17 AM

బత్తా

బత్తాయి కాయల్లో మంగు.. నివారణ చర్యలు

వాతావరణ మార్పులతో

నల్లి ఉనికి ఉధృతం

గుర్రంపోడు: బత్తాయి కాయలకు మంగు సోకడం వలన బత్తాయి తోటలు పెంచుతున్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. బత్తాయి కాయలపై మంగు ఏర్పడడంతో మార్కెట్‌లో ధర తగ్గిపోతుంది. నల్లగొండ జిల్లాలో 40వేల ఎకరాల్లో బత్తాయి తోటలు ఉండగా.. ప్రస్తుత చలి వాతావరణంలో మంచు వల్ల ఫిబ్రవరి, మార్చి నెల వరకు బత్తాయి కాయలపై మంగు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. బత్తాయిలో మంగు నివారించడంపై అనుముల ప్రాంతీయ ఉద్యానవన అధికారి మురళి అందిస్తున్న సూచనలు, సలహాలు ఇవీ..

నల్లి పురుగులతో మంగు

బత్తాయి కాయలపై మంగు ఏర్పడటానికి ప్రధాన కారణం మంగు నల్లి. ఈ నల్లులు కంటికి కనిపించనంత చిన్నవిగా ఉంటాయి. వీటి పిల్లలు పసుపురంగులో, పెద్ద నల్లులు నారింజ రంగులో ఉంటాయి. పిల్ల, పెద్ద మంగు నల్లులు పిందెల పైన, కాయల పైన పారాడుతూ బత్తాయి కాయల తొక్కల నుంచి రసం పీల్చుతాయి. రసాన్ని పీల్చే ప్రక్రియలో నల్లి నోటి నుంచి రసాయాన్ని వదులుతుంది. ఈ రసాయనం కాయ తోలు నుంచి స్రవించిన ద్రవం, సూర్యరశ్మితో మార్పు చెంది తుప్పు రంగుగా మారుతుంది. అందుకే బయటకు కనిపించే, సూర్యరశ్మి తగిలే కాయల్లో మంగు తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంది. బత్తాయి పిందెలకు నల్లి ఆశిస్తే కాయ సైజు తగ్గదు కాని మంగు వచ్చి తోలు గట్టిపడి పెలుసుగా మారుతుంది. కాయ రుచిలో తేడా రాదు. ఐనా మంగు కాయలకు తోలు గట్టిపడి పెలుసుగా మారి చూడటానికి నల్లగా కనిపిస్తున్నందున మార్కెట్‌లో ధర పలకదు. వ్యాపారులు కూడా తోటల్లో కొద్దిగా మంగు ఉన్నా చాలా ఎక్కువగా మంగు ఉందంటూ తక్కువ రేటుకు తీసుకుంటారు.

మంగు నల్లి నివారణ చర్యలు

● రైతులు భూతద్దం సహాయంతో నల్లి ఉనికిని కనిపెడుతూ ఉండాలి. ఒకటి, రెండు నల్లులు తోటలో ఎక్కడైనా పిందెలు, కాయలపై కనిపించగానే స్ప్రేయింగ్‌ మొదలుపెట్టాలి. రైతులందరూ సామూహికంగా నివారణ చర్యలు చేపట్టాలి.

● చెట్లలో కొమ్మల కత్తిరింపులు సకాలంలో చేసి చెట్టు లోపలికి గాలి, వెలుతురు బాగా ప్రసరించేటట్లు చూడాలి. బత్తాయి తోటల్లో ఎండు పుల్ల కత్తిరించిన వెంటనే లీటరు నీటికి 3గ్రాములు కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ పిచికారీ చేయాలి. ఈ రాగి ధాతువు శిలీంధ్రనాశిని కత్తిరించిన కొమ్మలకు రక్షణ ఇవ్వడమేగాక నల్లికి ప్రతికూలంగా ఉంటుంది.

● మంగు నివారణ మందులను ప్రతి 15 లేదా 20 రోజులకోమారు ఏప్రిల్‌ నెలాఖరు వరకు పిచికారీ చేయాలి. ఆ తర్వాత నెలకోసారి ఉధృతిని బట్టి పిచికారీ చేయాలి. లీటరు నీటికి 2 మిల్లీలీటర్ల ప్రాపర్‌గైట్‌ లేదా ఒక గ్రాము డైపెంఽథిరాన్‌ లేదా రెండు మిల్లీలీటర్ల ఇథియాన్‌ లీటరు నీటికి కలిపి మందు మార్చుతూ పిందెలన్నీ తడిసేలా పిచికారీ చేయాలి.

● పిందెలు గోళికాయ సైజు నుంచి నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు లీటరు నీటికి 5 గ్రాముల సల్ఫేట్‌ ఆఫ్‌ పొటాష్‌ మరియు 5 గ్రాముల మల్టీ–కే ఒకమారు పిచికారీ చేస్తే నల్లిని అణిచివేయడంతో పాటు కాయ సైజు పెరగుతుంది.

● నీటి తడులు ఎక్కువ కాకుండా అవసరం మేరకు డ్రిప్‌ పద్ధతిలో అందించాలి. సిఫారసు మేరకు సమతుల సమగ్ర ఎరువులు సకాలంలో అందించాలి. మంగు సోకిన కాయలను తోటలో ఉంచరాదు. తోటలో అంతర కృషి చేసి పరిశుభ్రత పాటించాలి.

చలి వాతావరణం నుంచి వేడి వాతావరణానికి మారుతున్న సమయం, వర్షాభావ పరిస్థితులు మంగు ఉధృతికి ఎక్కువగా దోహదం చేస్తాయి. వర్షానికి పురుగులు చెట్టు నుంచి జారి కిందపడి నశిస్తాయి. వర్షాలు తక్కువగా ఉంటే నల్లి పురుగులు చెట్లపైనే ఆవాసాన్ని ఏర్పరుచుకుని స్ధిరంగా ఉంటాయి.

బత్తాయి కాయల్లో మంగు.. నివారణ చర్యలు1
1/1

బత్తాయి కాయల్లో మంగు.. నివారణ చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement