చేనేత రంగాన్ని పరిరక్షించాలని వినతి
చౌటుప్పల్ : సంక్షోభంలో కూరుకుపోయిన చేనేత రంగాన్ని గట్టెక్కించేందుకు తగిన చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కోరారు. చేనేత సంఘం నాయకులతో కలిసి శుక్రవారం చేనేత, జౌళి శాఖ కమిషనర్ శైలజారామయ్యర్‌కు హైదరాబాద్‌లో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాసికంటి లక్ష్మీనర్సయ్యతో కలిసి ఆయన మాట్లాడారు. రూ.లక్షలోపు ఉన్న రుణాలను మాఫీ చేస్తామని సీఎం ప్రకటించి 14 నెలలు గడుస్తున్నా మాఫీ జరగలేదన్నారు. రైతులకు మాదిరిగా నేతన్నలకు సైతం రుణమాఫీ చేయాలని కోరారు. టెస్కో కొనుగోలు చేసిన వస్త్రాలకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా చేనేత సహకార సంఘాలు అప్పుల్లో కూరుకుపోయాయని పేర్కొన్నారు. జాప్యం చేయకుండా సంఘాలకు ఎన్నికలు నిర్వహించాని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో వెంకట్‌రాములు, పెండెం సర్వేశ్వర్, జల్ది రాములు, కస్తూరి భిక్షపతి, కర్నాటి మారయ్య, జనార్దన్, ఉప్పలయ్య ఉన్నారు.
ఫ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం


