ఎదురెదురుగా బైక్‌లు ఢీ.. ఒకరు మృతి
చౌటుప్పల్ రూరల్: ఎదురెదురుగా బైక్‌లు ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతిచెందగా, మరొకరు గాయపడ్డారు. ఈ ఘటన చౌటుప్పల్ మండలం దామెర గ్రామ శివారులో గురువారం రాత్రి జరిగింది. శుక్రవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దామెర గ్రామానికి చెందిన ఉప్పునూతల రమేష్(25) వ్యవసాయంతో పాటు గేదెలను పెంచుతూ పాల వ్యాపారం చేస్తున్నాడు. గురువారం రాత్రి రమేష్ తన బైక్‌పై తంగెడపల్లిలోని పాల కేంద్రం వద్దకు వెళ్లి పాలు పోసి తిరిగి ఇంటికి వస్తున్నాడు. అదే సమయంలో సంస్థాన్ నారాయణపురం మండలం గుడిమల్కాపురం గ్రామానికి చెందిన పిన్నింటి శ్రీనివాస్‌రెడ్డి బైక్‌పై చౌటుప్పల్ వైపు వెళ్తూ.. దామెర గ్రామ శివారులోకి రాగానే రమేష్ బైక్‌కు ఎదురుగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో రమేష్ తలకు తీవ్ర గాయమైంది. వెంటనే అతడిని అంబులెన్స్‌లో చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. శ్రీనివాస్‌రెడ్డికి తలకు గాయాలు కాగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. మృతుడి తండ్రి శ్రీశైలం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు.
ఫ మరొకరికి గాయాలు


