చిల్లాపురం జాతరకు పోటెత్తిన భక్తులు
సంస్థాన్ నారాయణపురం: మండలంలోని చిల్లాపురం గ్రామ సమీపంలోని గుట్టల్లో వెలిసిన శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయ సన్నిధిలో ఏటా కార్తీక పౌర్ణమి రోజున నిర్వహించే జాతర బుధవారం వైభవంగా కొనసాగింది. తెల్లవారుజాము నుంచే వివిధ ప్రాంతాల నుంచి సుమారు 30 వేలకుపైగా భక్తులు జాతరకు తరలిరావడంతో ఆలయ పరిసరాలు పోటెత్తాయి. అనంతరం భక్తులు కోనేరులో స్నానాలు చేసి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. గర్భగుడి దగ్గరలోని పుట్ట వద్ద కూడా పసుపు, కుంకుమతో పూజలు చేశారు. పవన్‌శాస్త్రి ఆధ్వర్యంలో శ్రీరామలింగేశ్వరస్వామికి జల, క్షీరాభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో వెలసిన దుకాణాల వద్ద కిక్కిరిశారు. భక్తులు గుట్ట కింద వనభోజనాలు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా సీఐ రాములు, ఎస్‌ఐ జగన్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. దేవాలయానికి వచ్చే భక్తులుకు, వాహనదారులుకు అటంకం లేకుండా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
ఫ శ్రీరామలింగేశ్వరస్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు
చిల్లాపురం జాతరకు పోటెత్తిన భక్తులు


