విద్యుదాఘాతంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి
ఆత్మకూరు(ఎం): ఇనుప పైప్ తొలగిస్తుండగా విద్యుత్‌తీగలు తగిలి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి చెందిన సంఘటన ఆత్మకూరు(ఎం) మండలంలోని లింగరాజుపల్లి గ్రామంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బూషి నర్సింహ– శోభ దంపతుల కుమారుడు బూషి గణేష్(23)కు ఏడాది క్రితం బెంగుళూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం రావడంతో అక్కడికి వెళ్లాడు. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో మూడు నెలల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. వర్క్ ఫ్రమ్ హోంలో భాగంగా ఇంటి వద్ద నుంచే విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం ఇంటి వెనుక భాగంలో ఉన్న ఇనుప పైప్‌ను తొలగిస్తుండగా పైన 11 కేవీ విద్యుత్ వైర్లు తాకడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గణేష్ అవివాహితుడు. మృతుడి తండ్రి నర్సింహ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సతీష్ తెలిపారు.


