పత్తికి ఆంధ్రా కూలీలు | - | Sakshi
Sakshi News home page

పత్తికి ఆంధ్రా కూలీలు

Oct 29 2025 9:57 AM | Updated on Oct 29 2025 9:57 AM

పత్తి

పత్తికి ఆంధ్రా కూలీలు

మా ఇద్దరి పిల్లలతో ఇక్కడికి వచ్చాం పనులు లేక రావాల్సి వచ్చింది

ప్రస్తుతం ఇక్కడికి పత్తి తీసేందుకు మా ఇద్దరి పిల్లలతో కలిసి వచ్చాం. వారి చదువు మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. తరువాత గుంటూరుకు మిర్చి ఏరేందుకు వెళ్తాం. మా రాష్ట్రంలో ప్రభుత్వం మాకు ఏదైనా ఉపాధి కల్పిస్తే పూట గడిచేది. వలస రాకుండా ఉంటే మా పిల్లలు చదువుకునేవారు.

– బోయ చంద్ర, కూలీ, కర్నూలు

మా ప్రాంతంలో వరి సాగు చేస్తున్నారు. కానీ అంతగా పనులు ఉండవు. తెలిసిన వారి వల్ల పత్తి పనుల కోసం ఇక్కడి వచ్చాను. కూలి బాగానే గిట్టుబాటు అవుతుంది. అక్కడ పనులు లేని సమయంలో ఇక్కడ పని దొరికినందుకు సంతోషంగా ఉంది. ఇటీవల వరుసగా వర్షం కురుస్తుడటంతో పనులు చేయలేకపోతున్నాం.

– బాలయ్య, త్రిపురాంతకం, ప్రకాశం జిల్లా

సంస్థాన్‌ నారాయణపురం, మర్రిగూడ: గతంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన కూలీలు పనుల కోసం ఆంధ్రా ప్రాంతానికి వెళ్లేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఆంధ్రా నుంచి కూలీలు తెలంగాణ ప్రాంతానికి వస్తున్నారు. నారాయణపురం, మునుగోడు, మర్రిగూడ మండలాల వ్యాప్తంగా రైతులు అధికశాతం పత్తి సాగు చేశారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు పత్తి పంట పాడవుతుందని రైతులు ఆందోళనలో ఉన్నారు. దీనికి తోడు స్థానికంగా కూలీల కొరత ఏర్పడడంతో రైతులు తమ చేలల్లో పత్తి ఏరడానికి ఆంధ్రా నుంచి వేల సంఖ్యలో కూలీలను తీసుకువచ్చారు. ఎక్కువగా ప్రకాశం, కర్నూలు ఉమ్మడి జిల్లాలకు చెందిన కూలీలు పత్తి తీయడానికి పెద్దఎత్తున వచ్చారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా ఆరుట్ల, మంచాల, జొన్నారం, అబ్దుల్లాపూర్‌మెట్‌లతో పాటు దేవరకొండ ప్రాంతం నుంచి వచ్చిన వారు పత్తితీత పనులు చేస్తున్నారు. అక్టోబర్‌ నుంచి జనవరి వరకు పత్తి తీసేందుకు, వరి నాట్లు వేయడానికి ఇక్కడే ఉండనున్నారు. వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లను స్థానిక రైతులే చూస్తున్నారు. తమ చేలల్లోనే వారికి గుడారాలు ఏర్పాటు చేసి కావాల్సిన వసతులు, సరుకులు అందిస్తున్నారు.

ఉదయం ఆరు గంటల నుంచే పని ప్రారంభం..

పెద్ద రైతులు ప్రకాశం, కర్నూలు ప్రాంతాల నుంచి వచ్చిన కూలీలకు వచ్చేందుకు రవాణా ఖర్చులతో పాటు తీసుకొచ్చిన రైతులు ఉచిత నివాసం, వంట చేసుకోవడానికి అవసరమైన కట్టెలను అందజేస్తున్నారు. కూలీలు ఉదయం 6గంటల నుంచే పని ప్రారంభించి, సాయంత్రం వరకు పనిచేస్తున్నారు. మండలంలోని సర్వేల్‌, మల్లారెడ్డిగూడెం, గుజ్జ, కొత్తగూడెం, జనగాం, గొల్లగూడెం తదితర ప్రాంతాలలో వీళ్లు పనులు చేస్తున్నారు. మునుగోడు మండలంలోని మునుగోడు, కొంపల్లి, చీకటిమామిడి, పలివెలతో పాటు తదితర ప్రాంతాల్లో కూడా పత్తి తీసే పనులు చేస్తున్నారు. సంస్థాన్‌ నారాయణపురం మండలానికే సుమారు 2వేల మందికి పైగా ఆంధ్ర కూలీలు పత్తి తీసే పనుల్లో నిమగ్నమయ్యారు. మర్రిగూడ మండలంలోని సరంపేట, లెంకలపల్లి, దామెరభీమనపల్లి, ఇందుర్తి, కమ్మగూడ, వట్టిపల్లి, మర్రిగూడ గ్రామాల్లో రైతులు 90శాతం పత్తి సాగు చేయడంతో అధక సంఖ్యలో కూలీలను తీసుకువచ్చారు.

ముందుగానే అడ్వాన్స్‌లు

చేలల్లో పత్తిని తీసేందుకు రైతులు ఆంధ్రా నుంచి కూలీలకు అడ్వాన్స్‌ చెల్లించి మరీ తీసుకువస్తున్నారు. వారు ఉదయం లేచిన నాటి నుంచి సాయంత్రం వరకు 70 నుంచి 80కిలోల వరకు పత్తి ఏరుతున్నారు. కిలో పత్తికి రైతులు రూ.15 చెల్లిస్తుండడంతో ఒక్కో కూలీ రోజుకు రూ.1050 నుంచి రూ.1200వరకు సంపాదిస్తున్నాడు. తమ రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేవని, తమ పిల్లల చదువులు కూడా వదిలేసి తమతోపాటే తీసుకురావాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయని ఆంధ్రా ప్రాంతానికి చెందిన కూలీలు ఆందోళన చెందుతున్నారు. అయితే పత్తి తీసేందుకు అధిక సంఖ్యలో కూలీలు రావడంతో నెల రోజుల్లోనే పత్తి ఏరే పనులు పూర్తవుతాయని, తరువాత పనుల కోసం వెతుక్కోవాల్సి వస్తుందని స్థానిక కూలీలు పేర్కొంటున్నారు.

ఆంధ్రా కూలీలే కాకుండా..

ఆంధ్రా ప్రాంతానికి చెందిన కూలీలే కాకుండా రంగారెడ్డి జిల్లా నుంచి ఆరుట్ల, మంచాల, లోయపల్లి, జొన్నారం, అబ్దుల్లాపూర్‌మెట్‌, నల్లగొండ జిల్లాలోని దేవరకొండ, వివిధ తండాల నుంచి గిరిజనులు పత్తి తీసేందుకు వస్తున్నారు. వీరికి రోజుకు రూ.400చొప్పున చెల్లిస్తున్నారు. దీంతో పాటు రవాణా ఖర్చుల కింద రూ.50నుంచి రూ.60 వరకు చెల్లిస్తున్నారు. ఇక్కడి నుంచి వచ్చిన కొంత మంది కూలీలు కిలో పత్తి తీయడానికి రూ.12చొప్పున తీసుకుంటున్నారు.

ఫ పత్తి ఏరేందుకు ప్రకాశం,

కర్నూలు జిల్లాల నుంచి

కూలీలను పిలిపించిన రైతులు

ఫ కేజీ, రోజు కూలీ

చొప్పున డబ్బులు చెల్లింపులు

ఫ తమ చేలల్లోనే గుడారాలు ఏర్పాటు చేసి కావాల్సిన వసతులు

సమకూరుస్తున్న రైతులు

పత్తికి ఆంధ్రా కూలీలు1
1/2

పత్తికి ఆంధ్రా కూలీలు

పత్తికి ఆంధ్రా కూలీలు2
2/2

పత్తికి ఆంధ్రా కూలీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement