ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నెమ్మికల్ బాలుడికి చో
ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట) : మండలంలోని నెమ్మికల్ గ్రామానికి చెందిన వెల్గూరి రాజేష్, లిఖిత దంపతుల కుమారుడు అద్వైత్ (23 నెలలు) అతి చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభ కనబరిచి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు. అద్వైత్ చిన్నప్పటి నుంచి యాక్టివ్ గా ఉండడాన్ని గమనించిన తల్లి లిఖిత ప్రతిరోజు వివిధ రకాల అంశాలను చెబుతూ ఉండేది. ఈమేరకు అద్వైత్ 26 ఆంగ్ల వర్ణమాల పదాలు, 9 మంచి అలవాట్లు, ఐదు రకాల వాహనాలు, 9 మంది స్వాతంత్య్ర సమరయోధుల పేర్లు, 10 శరీర భాగాలు, 10 రకాల జంతువులు, 12 రకాల ఫలాలు, నాలుగు రకాల రంగులను అతి చిన్న వయసులోనే వివిధ కేటగిరీల్లో 10 అంశాలను గుర్తించినందుకుగాను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు ఇటీవల ఆన్‌లైన్‌లో ప్రశంసా పత్రం, మెడల్‌ను ప్రకటించారు.
ఉరేసుకుని చేనేత కార్మికుడు ఆత్మహత్య
కట్టంగూర్ : భార్య అనారోగ్యంతో మృతి చెందడంతో చేనేత కార్మికుడు మద్యానికి బానిసయ్యాడు. మనస్తాపానికి గురై మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అయిటిపాముల గ్రామానికి చెందిన సంగిశెట్టి శేఖర్(65) భార్య పద్మ రెండు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో శేఖర్ మద్యానికి బానిసయ్యాడు. వీరికి కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. వృత్తి రీత్యా అతడి కుమారులు నల్లగొండలోని ఆర్జాలబావి వద్ద మగ్గం నేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శేఖర్ కుమారుల వద్దే ఉంటున్నాడు. 10 రోజుల క్రితం పింఛన్ డబ్బులు తీసుకువస్తానని కుమారులకు చెప్పి అయిటిపాములకు వెళ్లాడు. మంగళవారం గ్రామ శివారులోని శ్మశాన వాటికలో ఉన్న గదిలో లుంగీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి బంధువులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మునుగోటి రవీందర్ తెలిపారు.
రెండు గేట్ల ద్వారా
మూసీ నీటి విడుదల
నకిరేకల్ : మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద కొనసాగుతుండడంతో ప్రాజెక్టు రెండు క్రస్ట్ గేట్లను పైకెత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. మూసీ రిజర్వాయర్‌కు మంగళవారం ఎగువ నుంచి 2,964 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుంది. నీటిమట్టం గరిష్టస్థాయికి చేరువలో ఉండటంతో అధికారులు రెండు క్రస్ట్ గేట్ల ద్వారా 2,815 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.


