అదృష్టం కలిసొచ్చినా ఆయుష్షు దక్కలేదు!
మాడుగులపల్లి: నల్లగొండ జిల్లాలో సోమవారం నిర్వహించిన మద్యం దుకాణాల లక్కీ డ్రాలో అదృష్టం వరించినా.. కొద్దిరోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న ఆ వ్యక్తికి అదే రోజు ఆయుష్షు తీరింది. దీంతో మద్యం షాపు దక్కిన ఆనందంలో ఉండాల్సిన కుటుంబం తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది. మాడుగులపల్లి మండలంలోని గోపాలపురం గ్రామానికి చెందిన కాసాని అశోక్ (38) తిప్పర్తి మండల కేంద్రంలోని రైస్ మిల్లులో డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈనెల 21న పని నిమిత్తం నల్లగొండకు తన ద్విచక్ర వాహనంపై వెళ్లి పని ముగించుకుని తిరిగి వస్తున్నాడు. తిప్పర్తి మండలం మల్లెపల్లివారిగూడెం వద్దకు రాగానే ట్రాక్టర్ బలంగా ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. గమనించిన స్థానికులు వెంటనే నల్ల గొండ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యుల సూచనల మేరకు మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని కామినేని ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. అశోక్ మద్యం షాపుకై టెండర్ వేయగా ఇటీవల అధికారులు నిర్వహించిన లక్కీ డ్రాలో మాడ్గులపల్లిలోని షాపు దక్కించుకున్నాడు. ఆనందంలో ఉండాల్సిన కుటుంబసభ్యులు అశోక్ మృతితో శోకసంద్రంలో మునిగిపోయారు. మృతుడి నేత్రాలను కుటుంబసభ్యులు దానం చేశారు.
ఫ లక్కీ డ్రాలో దక్కిన మద్యం షాపు..
అంతలోనే దూరమైన సంతోషం
ఫ రోడ్డుప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి


