పోచంపల్లి చేనేత వస్త్ర తయారీపై అధ్యయనం
భూదాన్‌పోచంపల్లి: పోచంపల్లి ఇక్కత్ పరిశ్రమ, చేనేతపై అధ్యయనం చేయడానికి మంగళవారం యునైటెడ్ వే హైదరాబాద్ ఆధ్వర్యంలో ఫెర్నాడ్ రికార్డ్స్ ఇండియా ఫౌండేషన్ సహకారంతో యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల్లో ప్రీలూమ్స్, మగ్గాలపై శిక్షణ పొందుతున్న 50 మంది ట్రైనీ కార్మికులు భూదాన్‌పోచంపల్లిని సందర్శించారు. చేనేత కళాకారులైన రాపోలు శ్రీను, చెరిపల్లి రాము, ఆడెపు ఆంజనేయులు, మంగళపల్లి శ్రీహరి గృహాలను సందర్శించి అక్కడ మగ్గాలపై తయారవుతున్న చేనేత వస్త్రాలు, నూలు వడికే విధానం, చిటికి కట్టడం, ఆసుపై గ్రాఫ్ డిజైన్ వేయడం, రంగులద్దకం, మార్కెటింగ్ విధానాలు, చేనేతలో ఆధునిక పరికరాల వినియోగం తదితర అంశాలను పరిశీలించారు. పద్మశ్రీ చింతకింది మల్లేశం తాను ఆసుయంత్రాన్ని రూపొందించడానికి కల్గిన ప్రేరణ, ఇబ్బందులు, సాధించిన విజయాలను ట్రైనీ కార్మికులకు వివరించారు. వీరి వెంట యునైటెడ్ వే హైదరాబాద్ ప్రతినిధులు దిలీప్‌కుమార్, కోమల్ ఉన్నారు.


