
కిక్కులేని మద్యం టెండర్లు
సాక్షి, యాదాద్రి: ప్రభుత్వం మద్యం టెండర్ల దరఖాస్తు గడువు పెంచిన నేపథ్యంలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో జిల్లా ఎకై ్సజ్ శాఖ నిమగ్నమైంది. ఈనెల 23 వరకు గడువు ఉండటంతో మరిన్ని దరఖాస్తులను రాబట్టే పనిలో ఉంది. ఈ క్రమంలో తక్కువ దరఖాస్తులు వచ్చిన వైన్స్‌లపై దృష్టి సారించింది. అందుకు కారణాలను విశ్లేషిస్తోంది.
ఆదాయం పెరిగినా అంచనాలను చేరలేదు
2025–27 రెండు సంవత్సరాల కాలానికి గాను ప్రభుత్వం నూతన మద్యం టెండర్లు పిలిచింది. దరఖాస్తు గడువు ఈనెల 18న ముగిసింది. 2023లో నాన్ రిఫండబుల్ ఫీజు రూ.2 లక్షలు ఉండగా 3,969 దరఖాస్తులు వచ్చాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి రూ.79.38 కోట్ల ఆదాయం సమకూరింది. ఈసారి దరఖాస్తు ఫీజు రూ.3 లక్షలకు పెంచింది. 2,674 దరఖాస్తులు రాగా.. రూ.79.41 కోట్ల రాబడి వచ్చింది. ఆదాయపరంగా చూస్తే గతంలో కంటే రూ.3 లక్షలు పెరిగింది. కానీ, ప్రభుత్వ అంచనాలను చేరలేదని తెలుస్తోంది.
ఆలేరు సర్కిల్‌లో కనిపించని స్పందన
జిల్లాలో భువగగిరి, రామన్నపేట, మోత్కూరు, ఆలేరు ఎకై ్సజ్ సర్కిళ్లు ఉన్నాయి. ఇందులో ఆలేరు సర్కిల్‌లో తక్కువ దరఖాస్తులు వచ్చాయి. చాడలో రెండు, మోటకొండూరు, బొందుగుల, రుస్తాపూర్, రాజాపేట, తుర్కపల్లిలోని వైన్స్‌లకు 20 లోపే దరఖాస్తులు వచ్చాయి. రుస్తాపూర్‌లో 14, మోటకొండూరులో 15, చాడ షాప్ –1లో 16 దరఖాస్తులు అందాయి. ఇక్కడ మరిన్ని దరఖాస్తులు వచ్చేలా ఎకై ్సజ్ అధికారులు చర్యలు ప్రారంభించారు. టెండర్లు వేయాలని మద్యం వ్యాపారులను ప్రోత్సహిస్తున్నారు. మిగతా చోట్ల కూడా టెండర్ల పెంపునకు ప్రయత్నిస్తున్నారు.
ఎల్లంబావి వైన్స్‌కు అధికంగా..
గతంలో మాదిరిగానే ఈసారి కూడా చౌటుప్పల్ మండలం ఎల్లంబావి గ్రామ వైన్స్‌కు పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకున్నారు. జనరల్ కేటగిరీలో ఉన్న ఈ వైన్స్‌కు 88 దరఖాస్తులు వచ్చాయి. ఆ తరువాత వలిగొండ మండలం అర్రూరు వైన్స్‌కు 80, బీబీనగర్ మండలం భట్టుగూడెం 74, భువనగిరి మండలం అనాజిపురం మద్యం షాప్‌కు 64 దరఖాస్తులు దాఖలయ్యాయి.
వ్యాపారుల సిండికేట్ ప్రభావం
ప్రస్తుతం వైన్స్‌లు నిర్వహిస్తున్న వ్యాపారుల్లో కొందరు మళ్లీ వాటినే దక్కించుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. సిండికేట్‌గా ఏర్పడి చక్రం తిప్పారని, గతంతో పోలిస్తే 1,322 దరఖాస్తులు తగ్గాయని ఎకై ్సజ్ అధికారులు భావిస్తున్నారు. రానున్న స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ, మున్సిపల్, సహకార ఎన్నికల నేపథ్యంలో కొత్తవారికి అవకాశం లేకుండా వ్యూహాత్మకంగా దరఖాస్తులు వేశారని తెలుస్తోంది.
భారీగా తగ్గిన దరఖాస్తులు
తప్పిన ఎకై ్సజ్ శాఖ అంచనాలు
దరఖాస్తులు పెంచేలా ప్రయత్నం
23వ తేదీ వరకు గడువు పెంపు