
శ్రీగంధం చెట్లను నరికి చోరీకి పాల్పడుతున్న ముగ్గురి అరె
నల్లగొండ: రైతులు తోటల్లో పెంచుతున్న శ్రీగంధం చెట్లను నరికి చోరీకి పాల్పడుతున్న ముగ్గురు అంతర్‌రాష్ట్ర దొంగలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. కేసు వివరాలను బుధవారం నల్లగొండలోని డీఎస్పీ కార్యాలయంలో ఆయన వెల్లడించారు. బుధవారం ఉదయం కనగల్ సమీపంలో రెండు బైక్‌లపై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు వాహనాలు తనిఖీలు చేస్తున్న పోలీసులను చూసి అక్కడి నుంచి పరారయ్యేందుకు యత్నించారు. పోలీసులు వారిని వెంబడించి పట్టుకుని తనిఖీ చేయగా వారి వద్ద చెట్లు నరికే పరికాలను గుర్తించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గందిగామ్ గ్రామానికి చెందిన దివానా, అరుద్వా గ్రామానికి చెందిన దద్దసింగ్, సుగువా గ్రామానికి చెందిన మజాన్‌లుగా గుర్తించారు. వీరి వద్ద 11 శ్రీగంధం మొద్దులు (దుంగలు), మూడు సెల్‌ఫోన్లు, రెండు బైక్‌లు, మూడు రంపాలు, రెండు గొడ్డళ్లు, ఫెన్సింగ్ వైర్ కట్టర్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. మహారాష్‌ట్రకు చెందిన మరో ముగ్గురు నిందితులు అన్నాబౌ లక్ష్మణ్ గైక్వాడ్, జవాస్, అజుబాలు పరారీలో ఉన్నట్లు చెప్పారు. సమావేశంలో సీఐ ఆదిరెడ్డి, ఎస్‌ఐలు సైదాబాబు, వెంకన్న, రంజిత్‌రెడ్డి పాల్గొన్నారు.
ఫ 11 శ్రీగంధం దుంగలు, మూడు సెల్‌ఫోన్లు,
రెండు బైక్‌లు, ఫెన్సింగ్ వైర్ కట్టర్ స్వాధీనం