
ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకుని ఆత్మహత్య
హాలియా: ఆర్ధిక ఇబ్బందులతో ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అనుముల మండలంలోని కొత్తపల్లి గ్రామంలో ఆదివారం జరిగింది. ఎస్‌ఐ సాయిప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపల్లి గ్రామానికి చెందిన పాతనబోయిన నాగయ్య, పెద్ద మొగులమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు పాతనబోయిన నవీన్(30) స్థానికంగా ఓ రైస్ మిల్లులో డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం రాత్రి నవీన్ తన ఇంట్లోని ఓ గదిలో నిద్రించగా తల్లిదండ్రులు, సోదరుడు మరో గదిలో నిద్రించారు. ఈ క్రమంలో నవీన్ తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం వరకు గదిలో నుంచి నవీన్ బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యలు తలుపులు తీసి చూడగా అప్పటికే అతడు మృతిచెందాడు. గృహ నిర్మాణం కోసం చేసిన అప్పులతో నవీన్ గత కొంతకాలంగా మానసిక ఇబ్బందులు పడుతున్నాడు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేకనే నవీన్ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నాగార్జునసాగర్‌లోని కమలా నెహ్రూ ఆస్పత్రికి తరలించారు. మృతుడి సోదరుడు కిరణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.