
రైతుల ఆశలు.. అడియాసలు
నీరు వృథాగాపోతోంది
చందంపేట: దేవరకొండ నియోజకవర్గంలోని సుమారు మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఉద్దేశంతో 2008లో పురుడు పోసుకున్న నక్కలగండి ప్రాజెక్టు పనులు చిన్న చిన్న అవాంతరాలతో ఆగిపోయాయి. దీంతో ప్రాజెక్టు పూర్తయితే సాగునీటి కష్టాలు తీరుతాయని ఆశపడుతున్న రైతులకు నిరాశే ఎదురవుతోంది.
2008లో మొదలైన పనులు..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివంగత ముఖ్యమంతి వైఎస్ రాజశేఖరరెడ్డి సానుకూల నిర్ణయంతో 2008లో నక్కలగండి ప్రాజెక్టు నిర్మాణానికి పునాదులు పడ్డాయి. అడుగడుగునా అవాంతరాలను అధిగమిస్తూ వస్తున్నప్పటికీ ప్రాజెక్టు మాత్రం పూర్తి కావడం లేదు. శ్రీశైలం సొరంగం నుంచి వచ్చే నీటితో పాటు డిండి ప్రాజెక్టు మిగులు జలాలు నిల్వ చేసి దేవరకొండ నియోజకవర్గంలోని సుమారు మూడు లక్షల ఎకరాలకు సాగునీటిని అందించడంతో పాటు అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నీటిని సరఫరా చేసేలా ఈ ప్రాజెక్టును రూపకల్పన చేశారు. సుమారు 7.64 టీఎంసిల సామర్థ్యమున్న ఈ ప్రాజెక్టుకు మొత్తం 17 గేట్లు ఉండనున్నాయి. ప్రాజెక్టు పూర్తికాకపోవడంతో ప్రతి ఏడాది సుమారు 3 టీఎంసీల నీరు వృథా అవుతోందని అధికారులు అంచనా వేస్తున్నారు.
నెరవేరని రైతుల కల..
గత 17 ఏళ్లలో నక్కలగండి కట్ట నిర్మాణ పనులు 90 శాతం వరకు పూర్తయినప్పటికీ మిగతా 10 శాతం పనుల్లో మాత్రం తీవ్ర జాప్యం జరుగుతోంది. నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ, రోడ్డు మార్గం ఏర్పాటుకు అటవీ శాఖ అనుమతులు మినహా పెద్దగా చెప్పుకోదగ్గ అవాంతరాలంటూ ఏమీ లేకున్నప్పటికీ ప్రాజెక్టును పూర్తి చేయడంలో ప్రభుత్వాలు చొరవ తీసుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం శ్రీశైలం సొరంగ ప్రమాదం కారణంగా ఈ నక్కలగండి కట్టకు నీటి ప్రవాహం లేకున్నప్పటికీ డిండి ప్రాజెక్టు మిగులు జలాలు, ఎగువ ప్రాంతంలో కురిసే వర్షాల ద్వారా ఈ ప్రాజెక్టులో నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉందని, కానీ ప్రభుత్వాధికారులు, అధికారుల ఉదాసీనత కారణంగా ప్రతి ఏడాది నీరు వృథా అవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రాజెక్టు చాలా వరకు పూర్తి చేశారు. కొన్ని పనులు చేస్తే మొత్తం పూర్తయ్యేది. ప్రతి సంవత్సరం వర్షాల వల్ల చాలా నీరు వృథాగాపోతోంది. అధికారులు, ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ ప్రాజెక్టును పూర్తిచేస్తే మాకు సాగునీటి కొరత ఉండదు.
– ఆంగోతు నరేష్, రైతు
ఫ 90 శాతం పూర్తయిన
నక్కలగండి కట్ట నిర్మాణం
ఫ చివరి నిమిషంలో చిన్నచిన్న
సమస్యలతో నిలిచిన పనులు
ఫ ఏడాదికి 3 టీఎంసీల నీరు వృథా

రైతుల ఆశలు.. అడియాసలు

రైతుల ఆశలు.. అడియాసలు