
సూర్యక్షేత్రంలో ప్రత్యేక పూజలు
అర్వపల్లి: జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారాయణస్వామి క్షేత్రంలో ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున ఉషాపద్మిని ఛాయా సమేత సూర్యనారాయణస్వామిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపించారు. అనంతరం యజ్ఞశాలలో మహాసౌరహోమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజితాజనార్దన్, గణపురం నరేష్, సత్యనారాయణ, ఇంద్రారెడ్డి, గిరి, బెలిదె లక్ష్మయ్య, అర్చకులు భీంపాండే, శ్రీరాంపాండే, అంకిత్‌పాండే, భక్తులు పాల్గొన్నారు.
ట్రాక్టర్ ఢీకొని వృద్ధుడు మృతి
గరిడేపల్లి: బైక్‌పై వెళ్తున్న వృద్ధుడిని ట్రాక్టర్ ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన గరిడేపల్లి మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గరిడేపల్లి మండల కేంద్రానికి చెందిన బొంత సైదిరెడ్డి(75) బంధువుల శుభకార్యానికి హాజరయ్యేందుకు బైక్‌పై పొనుగోడు రోడ్డులోని ఫంక్షన్ హాల్‌కి వెళ్తున్నాడు. ఈ క్రమంలో స్థానిక గుండాలమ్మ దేవాలయం సమీపంలో యూటర్న్ వద్ద సైదిరెడ్డి బైక్‌ను ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సైదిరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు గరిడేపల్లి ఎస్‌ఐ చలికంటి నరేష్ తెలిపారు.
లిఫ్టు గుంతలో పడి..
నల్లగొండ: అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న వ్యక్తిపై లిఫ్టు గుంతలో పడి మృతిచెందాడు. ఈ ఘటన నల్లగొండ పట్టణంలోని అబ్బాసియా కాలనీలో శనివారం రాత్రి జరిగింది. ఆదివారం నల్లగొండ వన్ టౌన్ పోలీసులు తెలిపిన ప్రకారం.. అబ్బాసియా కాలనీకి చెందిన ఖాజా మొయినొద్దీన్ అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉంటున్నాడు. అతడు వేములపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి మొయినొద్దీన్ తాను నివాసముంటున్న అపార్ట్‌మెంట్‌లో రెండో అంతస్తు నుంచి కిందకు దిగేందుకు లిఫ్లు వద్దకు వచ్చాడు. ఈ క్రమంలో లిప్టు డోర్లు ఓపెన్ కావడంతో అతడు రెండో అంతస్తు నుంచి లిఫ్టు గుంతలో పడిపోయాడు. అనంతరం అతడిపై నుంచి లిప్టు పడటంతో తీవ్ర గాయాలపాలై మృతిచెందాడు. ప్రమాదం జరిగిన రెండు గంటల తర్వాత అపార్ట్‌మెంట్ వాసులు గుర్తించి కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వన్ టౌన్ సీఐ రాజశేఖర్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
కృష్ణమ్మ పరవళ్లు
నాగార్జునసాగర్: ఎగువ ప్రాంతాల నుంచి సాగర్‌కు ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ఆదివారం 85,118 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా అధికారులు నాలుగు గేట్లను ఎత్తి 32,316 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా 33,454 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ కాల్వలు, ఏఎమ్మార్పీకి 19,348 క్యూసెక్కులు వదులుతున్నారు. సాగర్ జలాశయ గరిష్ట నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589.80 అడుగులుగా ఉంది.

సూర్యక్షేత్రంలో ప్రత్యేక పూజలు