
రెండు రాష్ట్రాల మధ్య వివాదానికి కేంద్రం కుట్ర
మిర్యాలగూడ : రెండు రాష్ట్రాల మధ్య వివాదాన్ని సృష్టించి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఆరోపించారు. ఆదివారం మిర్యాలగూడ పట్టణంలోని బృందావన్ గార్డెన్‌లో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు డబ్బికార్ మల్లేష్ సతీమణి సుమిత్రిబాయి సంతాప సభలో ఆయన పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, ఎండీ అబ్బాస్, సీనియర్ నాయకులు డీజే. నర్సింగ్‌రావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. బనకచర్ల విషయంలో ఏపీ ప్రభుత్వానికి సహకరించాలని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం లేఖ రాయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచి, బనకచర్ల నిర్మించడం వల్ల తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. మెదక్ జిల్లాలో మహిళపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. హన్మకొండలో నకిలీ రైతులు, భూమి లేకుండా ధాన్యం అమ్మకపోయినా ప్రభుత్వ సొమ్ము రూ.1.86 కోట్లు కాజేశారని ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చిందని వాటిలో ఏ ఒక్కటి సక్రమంగా అమలు కావడం లేదన్నారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. బీసీ రిజర్వేషన్ చట్టబద్ధత కోసం రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేయబోతుందని, అది సరిపోదని అన్ని పార్టీలను కలుపుకొని కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. ట్రంప్ భారతదేశంపై అనేక సుంకాలు విధిస్తున్నా మోదీ మెతక వైఖరి వహించడం సరికాదన్నారు. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై సోయాబీన్, పత్తి, మాంసం, పాల వంటి వ్యవసాయ ఉత్పత్తులను భారతదేశానికి దిగుమతి చేసేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నాడని, అలా చేస్తే దేశంలో వ్యవసాయం కుంటుపడుతుందన్నారు. సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, డబ్బికార్ మల్లేష్, కందాల ప్రమీల, సయ్యద్ హాషం, వీరేపల్లి వెంకటేశ్వర్లు, మల్లు గౌతంరెడ్డి, బావండ్ల పాండు, రవినాయక్, వినోద్‌నాయక్, శశిధర్‌రెడ్డి, పరుశురాములు, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఫ బనకచర్లకు సహకరించాలని
కేంద్రం లేఖ రాయడం సరికాదు
ఫ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ