
ఆర్టీఐఏపై అవగాహన తప్పనిసరి
సాక్షి,యాదాద్రి : పనితీరులో పారదర్శకత, జవాబు దారీతనాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో రూపొందించిన సమాచార హక్కు చట్టం(ఆర్టీఐఏ)–2005పై అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. సమాచార హక్కు చట్టం వారోత్సవాల్లో భాగంగా శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయిలో అన్ని శాఖల అధికారులకు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్‌రావుతో కలిసి కలెక్టర్ మాట్లాడారు. చట్టంపై, చట్టంలో పొందుపరిచిన ప్రతి అంశంపై అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉన్నప్పుడే దరఖాస్తుదారుడు కోరిన సమాచారాన్ని సరైన విధంగా, నిర్ణీత గడువులో ఇవ్వగలుగుతారని పేర్కొన్నారు. క్షేత్ర సిబ్బందికి సైతం చట్టంపై అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో డీఆర్‌ఓ జయమ్మ, ఆర్డీఓలు కృష్ణారెడ్డి, శేఖర్‌రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, డీఆర్‌డీఓ నాగిరెడ్డి, కలెక్టరేట్ ఏఓ జగన్మోహన్‌ప్రసాద్ పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు