
బీసీ రిజర్వేషన్ వ్యతిరేకులకు రాజకీయ సమాధి తప్పదు
నల్లగొండ టౌన్: బీసీ రిజర్వేషన్ వ్యతిరేకులకు రాజకీయ సమాధి తప్పదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆయన శనివారం నల్లగొండలోని బీసీ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర జనాభాలో 60 శాతానికి పైగా ఉన్న బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వం కల్పించగా, రెడ్డి జాగృతికి చెందిన కొంతమంది కోర్టుల ద్వారా అడ్డుకోవాలని చూస్తున్నారని అన్నారు. బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటే భవిష్యత్తులో బీసీలంతా ఒక్కటై వారిని రాజకీయంగా సమాధి చేస్తారని ఆయన అన్నారు. ఉన్న జనాభా కంటే 18 శాతం రిజర్వేషన్లు తక్కువ చేసి 42 శాతంతో బీసీలకు సరిపెట్టి స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ, రెడ్డి జాగృతికి చెందిన వారు బీసీ రిజర్వేషన్లు చెల్లవంటూ కోర్టులకు వెళ్లారని తెలిపారు. ఐదు శాతం ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు గత 80 ఏళ్లుగా 90 శాతం పదవులు అనుభవిస్తూ బీసీల వాటాను అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఈ నెల 8న రాష్ట్ర హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల కేసు ఉన్నందున స్థానిక సంస్థల ఎన్నికలు జరగవంటూ.. బీసీ రిజర్వేషన్ల అమలు కావంటూ కొంతమంది ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. బీసీ రిజర్వేషన్లకు గవర్నర్ ఆమోదముద్ర వేసే బాధ్యత బీజేపీ తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు ఆగిపోతే దానికి బీజేపీ బాధ్యత వహించాలన్నారు. మీడియా సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజు, కాసోజు విశ్వనాథం, నల్ల సోమ మల్లన్న, కేశబోయిన శంకర్ తదితరులు పాల్గొన్నారు.
ఫ బీసీ సంక్షేమ సంఘం జాతీయ
అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్