
తప్పిపోయిన బాలుడిని తల్లిదండ్రులకు అప్పగింత
భువనగిరి: ఆలేరులో తప్పిపోయిన బాలుడిని బాలల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో శనివారం అతడి తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు. బాలల సంక్షేమ సమితి చైర్మన్ బండారు జయశ్రీ తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 30వ తేదీన ఆలేరులో 9 సంవత్సరాల బాలుడు తప్పిపోయాడు. పోలీసులు బాలుడిని గుర్తించి భువనగిరిలోని బాలల సంక్షేమ సమితికి సమాచారం అందించారు. ఆ బాలుడికి భువనగిరిలోని చైల్డ్ కేర్ ఇనిస్ట్యూషన్స్‌లో ఆశ్రయం కల్పించారు. బాలుడి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రి అని తెలుసుకుని అతడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న బాలుడి తల్లిదండ్రులు శనివారం భువనగిరిలోని బాలల సంక్షేమ సమితికి రాగా.. వారికి బాలుడిని అప్పగించారు. ఈ కార్యక్రమంలో బాలల సంక్షేమ సమితి సభ్యులు ఎర్ర శివరాజ్, సిబ్బంది తదితరులు ఉన్నారు.