
డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి
ఫ మరో ఇద్దరికి గాయాలు
నేరేడుచర్ల: కారు డివైడర్‌ను ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున నేరేడుచర్ల పట్టణంలో జరిగింది. స్థానిక ఎస్‌ఐ రవీందర్‌నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం ధర్మవరపాడుకు చెందిన ఫొటోగ్రాఫర్ నిమ్మతోట తనూజ్‌కుమార్(27) తన స్నేహితులు ఎస్‌కే నహీం, మాసిబోయిన నరహరి, తోము లోకేష్‌తో కలిసి సూర్యాపేట జిల్లా గరిడేపల్లిలో ఓ ఈవెంట్‌కు సంబంధించి ఫొటోగ్రఫీ గురించి మాట్లాడేందుకు సోమవారం రాత్రి కారులో వచ్చారు. ఈవెంట్ గురించి మాట్లాడిన అనంతరం తాగునీటి కోసం మంగళవారం తెల్లవారుజామున నేరేడుచర్లకు చేరుకొని ఓ టీస్టాల్ వద్ద ఆగారు. టీస్టాల్ ము ందు కారులో నుంచి లోకేష్‌ను దింపి యూటర్న్ తీసుకొని వస్తామంటూ మిర్యాలగూడ రోడ్డులోని హెచ్‌పీ బంక్ వైపు వెళ్తూ రోడ్డు మధ్యలో డివైడర్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తనూజ్‌కుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు. కారు ముందుభాగం నుజ్జునుజ్జయ్యింది. కారులో ఉన్న నహీం, నరహరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి సోదరుడు నిమ్మతోట తరుణ్‌గోపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.