
తుది దశకు గంధమల్ల భూ సేకరణ
తుర్కపల్లి: ఆలేరు నియోజకవర్గంలో 65 వేల ఎకరాలకు సాగు నీరందించే ఉద్దేశంతో చేపట్టిన గంధమల్ల ప్రాజెక్ట్ పనుల్లో యంత్రాంగం మరింత వేగం పెంచింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు వీలైనంత త్వరగా భూసేకరణ పూర్తి చేసి, అవార్డ్ పాస్ చేయడానికి చర్యలు చేపట్టింది. ఇప్పటికే 750 ఎకరాల భూ సేకరణ పూర్తి కాగా.. నిర్వాసిత రైతులకు పరిహారం చెల్లించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
సేకరించాల్సిన భూమి 1,028.83
1.43 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం, రూ.575 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న రిజర్వాయర్‌కు 547 మంది రైతుల నుంచి 1,028.83 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఇందులో గంధమల్ల రెవెన్యూ పరిధిలో 750, వీరారెడ్డిపల్లి పరిధిలో 250 ఎకరాలకు పైగా భూములు ఉన్నాయి. రెండు కిలో మీటర్ల మేర రిజర్వాయర్ బండ్(కట్ట) నిర్మాణానికి 112 ఎకరాలు పోను మిగతా భూమి ముంపునకు గురవుతుంది.నిర్వాసిత రైతులతో అధికారులు పలుమార్లు చర్చలు జరిపి ఎకరాకు రూ.24.50 లక్షలుగా పరిహారం ఖరారు చేశారు. ఇందుకు 650 ఎకరాలకు సంబంధించి రైతులు అంగీకారం తెలియజేసినట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. 100 ఎకరాలకు సంబంధించి రైతుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
నోటీసుల జారీకి సన్నాహాలు
రిజర్వాయర్ నిర్మాణం వేగంగా చేపట్టేందుకు తొలుత గంధమల్ల రెవెన్యూ పరిధిలోని రైతులకు పరిహారం చెల్లించనున్నారు. ఆ తరువాత వీరారెడ్డిపల్లి భూ నిర్వాసితులకు చెల్లించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం ముంపు ప్రభావిత భూముల రైతులకు నోటీసులు జారీ చేయటానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
750 ఎకరాల భూసేకరణ పూర్తి
ఫ ఎకరాకు రూ.24.50 లక్షలు చొప్పున పరిహారం ఖరారు
ఫ మెజార్టీ రైతుల అంగీకారం
ఫ చెల్లింపులకు సిద్ధమవుతున్న అధికారులు