
బతుకమ్మ చీరలు కాదు.. యూనిఫామ్
ఫ స్వయం సహాయక సంఘాలకు డ్రెస్ కోడ్
ఫ ఒక్కో సభ్యురాలికి రెండు చీరలు..
ఫ బతుకమ్మ పండుగతో సంబంధం
లేకుండా త్వరలో పంపిణీ
సాక్షి యాదాద్రి : బతుకమ్మ చీరలు ఈసారి కూడా లేనట్టే. ప్రస్తుతం పంపిణీ చేయనున్న చీరలు స్వయం సహాయక సంఘాల సభ్యులకు యూనిఫాం మాత్రమే. ఇందిరా మహిళా శక్తి సంఘాల చీరల పేరుతో వీటిని పంపిణీ చేయనున్నారు. ఒక్కో సభ్యురాలికి సంవత్సరానికి రెండు చొప్పున చీరలు ఇస్తారు. జిల్లాకు 3 లక్షల 2వేల చీరలు రావాల్సి ఉండగా, ఇప్పటి వరకు 36,200 చీరలు మాత్రమే వచ్చాయి. బతుకమ్మ పండుగతో సంబంధం లేకుండా ఎప్పుడైనా చీరలు పంపిణీ చేయవచ్చిని అధికారులు చెబుతున్నారు.
బతుకమ్మ చీరలుగా ప్రచారం
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గత ఏడాది బతుకమ్మ పండుగకు మహిళలకు చీరలు ఇవ్వలేకపోయింది. ఈసారి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఒక్కొక్కరికి రెండు చీరలు ఇవ్వాలనే ఉద్దేశంతో నేతన్నలకు పని కల్పిస్తున్నామని సీఎం సైతం అన్నారు. అయితే ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తామన్న చీరలు మహిళా సంఘాల సభ్యులకని, ఏడాదికి రెండు చీరలు ఇస్తున్నామని ప్రకటించారు. సంఘాల్లో లేని మహిళలకు చీరలు ఎందుకు ఇవ్వరన్న చర్చ మొదలైంది.
సంఘాల్లో 1,59,482 మంది సభ్యులు
జిల్లాలో 14,848 స్వయం సహాయక సంఘాలున్నాయి. వీటిలో 1,59,482 మంది సభ్యులు ఉన్నారు. 50 ఏళ్ల వయసులోపున్న వారు 1,19,373, 50 ఏళ్ల పైబడిన మహిళలు 39,617 మంది ఉన్నారు. వీరితోపాటు 492 మంది గోచి చీర ధరించే వారు ఉన్నారు. రామన్నపేట గోదాములో సెర్ప్‌కు సంబంధించి 85,658, మెప్మా 13,517 చీరలు నిల్వ చేయనున్నారు. బొమ్మలరామారం మండలం మైలారం గోదాంలో సెర్ప్ 73,824, మెప్మా డిపార్ట్‌మెంట్ చీరలు 18,812 నిల్వ చేయనున్నారు. ప్రస్తుతం 36,200 చీరలు రాగా వాటిని రామన్నపేట గోదాములో భద్రపరిచారు.