
కుంగిన రహదారి
మోత్కూరు: మోత్కూరు మినీ ట్యాంక్‌బండ్ ప్రమాదకరంగా మారింది. చెరువు కట్టపై కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించిన బీటీ రోడ్డు శుక్రవారం సాయంత్రం ఉన్నట్టుండి ఒక వైపు కుంగిపోయింది. దీంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. సుమారు 100 మీటర్ల పొడవు, 2 ఫీట్ల లోతు కుంగి, బీటీకి పగుళ్లు ఏర్పడ్డాయి. గత ఏడాది కూడా ఇదే ప్రాంతంలో రోడ్డు కుంగడంతో మరమ్మతులు చేశారు. మళ్లీ అక్కడే కుంగడంతో పనుల నాణ్యతపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంఘటన స్థలాన్ని సూర్యాపేట జిల్లా ఇరిగేషన్ సర్కిల్ ఎస్‌ఈ శివధర్మతేజ, తిరుమలగిరి జోన్ ఈఈ సత్యనారాయణగౌడ్ సందర్శించారు. చెరువు నిండి అలుగుపోస్తుండటంతో కట్ట లీకేజీ అవుతుందని, రోడ్డు ప్రమాదకరంగా ఉందని గుర్తించినట్లు ఎస్‌ఈ తెలిపారు. ప్రస్తుతం తాత్కాలిక మరమ్మతులు చేపట్టి, వేసవిలో సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని చెప్పారు. కుంగిన చోట బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులను కాపలా పెట్టారు.
ఫ చెరువు కట్ట రోడ్డుపై ఏడాదిలో రెండోసారి గొయ్యి
ఫ రూ.కోట్లు వెచ్చించి నిర్మాణం, నాణ్యతపై విమర్శలు