
దొంగ అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు
సూర్యాపేట: ఒకే రోజు పలు ఇళ్లలో చోరీకి పాల్పడిన దొంగపై కేసు నమోదు చేసి గురువారం రిమా ండ్‌కు తరలించినట్లు సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్ తెలిపారు. డీఎస్పీ విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట పట్టణంలోని సీతారాంపురం కాలనీకి చెందిన గంపల శ్యామ్ ఈ నెల 22న చివ్వెంల మండలంలోని కొండలరాయినిగూడెం గ్రామానికి చెందిన వల్లపురాణి, కొంపల్లి జయమ్మ, అల్లి మల్లిక ఇళ్లలో చోరీకి పాల్పడి, బంగారం, వెండి వస్తువులు అపహరించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ వి. మహేశ్వర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గురువారం బీబీగూడెం గ్రామ శివారులో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన గంపల శ్యామ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా.. తాను చోరీ చేసినట్లు నిజం ఒప్పుకున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి బైక్, నల్లపూసల గొలుసు 14.5 గ్రాములు, జుంకాలు 1.23 గ్రాములు, మూడు జతల పట్టీలు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. విలేకరుల సమావేశంలో సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్, ఎస్‌ఐలు మహేశ్వర్, కనకరత్నం, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
విద్యుదాఘాతంతో మెకానిక్ మృతి
సూర్యాపేట: వ్యవసాయ బావి వద్ద విద్యుత్ వైర్లను చెక్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై మెకానిక్ మృతిచెందాడు. ఈ ఘటన ఆత్మకూర్(ఎస్) మండల పరిధిలోని దాచారం గ్రామంలో గురువారం జరిగింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దాచారం గ్రామానికి చెందిన విద్యుత్ మెకానిక్ బుడిగబోయిన హనుమయ్య(58) గురువారం అదే గ్రామానికి చెందిన పులుగుజ్జు మల్లయ్య అనే రైతు వ్యవసాయ బోరు వద్ద ఉన్న విద్యుత్ వైరుకు కరెంట్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో సరిచేసేందుకు వెళ్లాడు. విద్యుత్ వైర్లు పరిశీలిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై హనుమయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. హనుమయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని అతడి బంధువులు మృతదేహాన్ని రైతు పులుగుజ్జు మల్లయ్య ఇంటి ముందు ఉంచి నిరసన తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా రైతు మల్లయ్యను అదుపులోకి తీసుకున్నారు. మృతుడు హనుమయ్య కుమారుడు శంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

దొంగ అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు