
సిమెంట్ లారీ ఢీకొని బాలిక మృతి
కట్టంగూర్, నకిరేకల్ : ఆగి ఉన్న కారును సిమెంట్ లారీ ఢీకొనడంతో బాలిక మృతిచెందింది. ఈ ఘటన కట్టంగూర్ మండలం ముత్యాలమ్మగూడెం గ్రామ శివారులో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్ పట్టణంలోని చీమలగడ్డకు చెందిన కందుల రుతు ఝాన్సీ తన కుమార్తె లవీణతో పాటు ఇద్దరు మనుమరాళ్లు రెముడాల అద్వితీరియా(14), ఎండీ అలీనతో కలిసి స్వగ్రామం నుంచి కారులో హైదరాబాద్‌లో ఉంటున్న తన కుమారుడి వద్దకు గురువారం ఉదయం బయల్దేరారు. మార్గమధ్యలో కట్టంగూర్ మండలం ముత్యాలమ్మగూడెం గ్రామ శివారులోని గచ్చుగురు చెరువు వద్దకు రాగానే కారు వెనుక టైరు పంక్చర్ కావడంతో డ్రైవర్ విజయవాడ–హైదరాబాద్ హైవే పక్కన ఆపాడు. కారులో ఉన్న వారందరూ కిందికి దిగి హైవే పక్కకు నిలబడగా.. అద్వితీరియా కారు ముందు భాగంలో నిలబడింది. డ్రైవర్ ఏర్పుల సామేల్ టైరు మార్చుతున్న క్రమంలో కోదాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న సిమెంట్ లారీ అతివేగంగా వచ్చి కారును వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో కారు ముందుకు దూసుకపోవటంతో క్యాబిన్ ముందు ఉన్న అద్వితీరియాను తలకు తీవ్రగాయాలయ్యాయి. అదేవిధంగా అలీనకు స్వల్ప గాయాలయ్యాయి. వారిద్దరిని 108 వాహనంలో నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ అద్వితీరియా మృతి చెందింది. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వాపత్రికి తరలించారు. మృతురాలి తాత కందుల లాజరస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మునుగోటి రవీందర్ తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ లారీని అక్కడే నిలిపి పారిపోయాడు.

సిమెంట్ లారీ ఢీకొని బాలిక మృతి