
సోమవారం ప్రజావాణి.. గురువారం ప్రజాదర్బార్
సమస్యల పరిష్కారం కోసం మరింత పాటుపడుతా
ఫ ప్రజా సమస్యల పరిష్కారం కోసం
కలెక్టరేట్‌లో ప్రత్యేక గ్రీవెన్స్
ఫ ప్రతి గురువారం మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రజాదర్బార్
ఫ పూర్తి సమయం కేటాయించి వినతులకు పరిష్కారం చూపుతున్న కలెక్టర్
సాక్షి,యాదాద్రి: కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణిలో వస్తున్న వినతుల్లో కొన్ని నెలల తరబడి పరిష్కారానికి నోచుకోవడం లేదు. దీంతో బాధితులు పదేపదే కలెక్టరేట్ గడప తొక్కుతున్నారు. సమయం, డబ్బు వృథా అవుతోంది. సుదూర ప్రాంతాల నుంచి తరచూ రావాలంటే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అధికారులను నిలదీస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సమస్యను గర్తించిన పాలనాధికారి తన వినూత్న ఆలోచనతో శ్రీప్రజాదర్బార్‌శ్రీకు శ్రీకారం చుట్టారు. ప్రతి గురువారం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
బాధితులకు భరోసా కల్పిస్తూ..
ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని మధ్యాహ్నం 2నుంచి రాత్రి 8గంటల వరకు నిర్వహిస్తున్నారు. కలెక్టర్ పూర్తి సమయం అందుబాటులో ఉంటూ బాధితులతో నేరుగా మాట్లాడుతున్నారు. ప్రతి దరఖాస్తుదారుకు సమయం ఇచ్చి సమస్య తెలుసుకుంటున్నారు. దరఖాస్తు ఫారాన్ని స్కాన్ చేసి సంబంధిత శాఖకు పంపిస్తున్నారు. అధికారికి ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. అంతేకాకుండా ఫిర్యాదును తనవద్ద ఫైల్ చేసుకొని , పరిష్కారానికి తేదీ ఇచ్చి అర్జీదారులకు భరోసా కల్పిస్తున్నారు. అర్జీలను స్వీకరించిన కలెక్టర్.. సమస్యను నేరుగా అధికారులకు వివరించి పరిష్కా రానికి చొరవచూపుతుండటంతో అర్జీదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, బిల్లుల చెల్లింపులో జాప్యం, ఆసరా పింఛన్లు, భూ వివాదాలు, ఆక్రమణలు తదితర సమస్యలపై ఎక్కువగా వినతులు వస్తున్నాయి.
సమస్య తెలుసుకొని,అధికారులను ఆదేశించి..
● ప్రత్యేక గ్రామ పంచాయతీ చేయాలని ఆలేరు మండలం రాజానగర్ ప్రజలు గురువారం కలెక్టర్‌ను కలిశారు. గ్రామం గతంలో కొలనుపాక పంచాయతీలో ఉన్నదని, బైరాంనగర్‌లో కలుపడంవల్ల తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని కలెక్టర్ కు వివరించారు. కలెక్టర్ వెంటనే డీపీఓ విష్ణువర్థన్‌రెడ్డికి ఫోన్ చేసి గ్రామస్తుల సమస్యను వివరించారు. పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
● నారాయణపురం మండలం పుట్టపాకకు చెందిన అనసూర్య భూసమస్య పరిష్కరించాలని కలెక్టర్‌కు విన్నవించారు. వెంటనే తహసీల్దార్‌కు ఫోన్ చేశారు. బాధితురాలి కుటుంబ సభ్యులతో చర్చించి సమస్య పరిష్కరించాలని సూచించారు.
● ఇందిరమ్మ ఇళ్ల బిల్లు రాలేదని యాదగిరిగుట్టకు చెందిన లబ్ధిదారులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా అక్కడి నుంచే హౌసింగ్ ఉద్యోగితో మాట్లాడి డేటా చెక్ చేయించారు. బిల్లు వచ్చిందని, ఆధార్ సీడింగ్ లేకపోవడంతో లబ్ధిదారుల ఖాతాలో జమ కాలేదని చెప్పారు. వెంటనే ఆధార్ సీడింగ్ చేయాలని కలెక్టర్ అదేశించారు.
● ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని మోత్కూరు మండలం ఆనాజిపురానికి చెందిన పర్వతం సరస్వతి కలెక్టర్‌ను వేడుకున్నారు. ఎంపీడీఓతో మాట్లాడి ఇల్లు మంజూరు చేయాలని ఆదేశించారు. ఇళ్లు మంజూరై నిర్మించుకోలేని వారు ఉంటే రద్దు చేసి ఇవ్వాలన్నారు.
● సైదాపురం చెరువు మత్తడిని తొలగించడంతో తమ పొలాలు మునిగిపోతున్నాయని మాసాయిపేట రైతులు విన్నవించారు. వెంటనే ఇరిగేషన్ ఎస్‌ఈతో కలెక్టర్ మాట్లాడారు. పర్సనల్ సమస్యగా భావించి పరిష్కరించాలని ఆదేశించారు.
గ్రామాలకు వెళ్లినప్పుడు ప్రజలు వివిధ సమస్యలను ఏకరువు పెడుతున్నారు. అంతేకాకుండా ప్రజావాణికి తరచూ వచ్చిపోతున్నారు. ఇలాంటి వారికోసం గురువారం సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నా. ప్రజాదర్బార్ పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో చాలా వరకు సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం అవుతున్నాయి. పరిష్కారం కాని సమస్యలను బాధితులకు వివరిస్తున్నా. ప్రజల సమస్యల పరిష్కారం కోసం మరింత పాటుపడుతా. –కలెక్టర్ హనుమంతరావు

సోమవారం ప్రజావాణి.. గురువారం ప్రజాదర్బార్