
తూకం తప్పుతున్న ధర్మకాంటా!
మోత్కూరు: ఆరుగాలం కష్టపడి సేద్యం చేసిన రైతులు అన్ని విధాలా మోసపోతున్నారు. పండించిన పంట చేతికొచ్చాక దారుణంగా నష్టపోతున్నారు. ప్రైవేట్ వ్యాపారుల దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ కాంటాల దగ్గరనుంచి మిల్లుల వద్ద వే బ్రిడ్జిల వరకు తూకాల్లో తేడా ఉంటుంది. వ్యాపారులు వినియోగించే కాంటాలపై తూనికల, కొలతల వ్యాపారుల దృష్టి సారిస్తే గుట్ట బయటపడుతుంది. త్వరలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో తనిఖీలు నిర్వహించకపోతే తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని రైతులు అంటున్నారు.
ఏం జరిగిందంటే..
మోత్కూరు మండలంలో ముందస్తు వరికోతలు మొదలయ్యాయి. రైతు మలిరెడ్డి సంతోష్‌రెడ్డి 10 ఎకరాల్లో వరి సాగు చేయగా అందులో కొంత భాగంగా కోత కోయించాడు. 98 క్వింటాళ్ల దిగుబడి రాగా రెండు ట్రాక్టర్లలో పాలడుగు గ్రామానికి చెందిన అంతటి నర్సయ్యకు విక్రయించాడు. ధాన్యాన్ని అనాజిపురంలో నర్సయ్యకు చెందిన వేబ్రిడ్జిపై తూకం వేయించాడు. తూకంలో తేడా వచ్చిందని సంతోష్‌రెడ్డికి అనుమానం రావడంతో మరో వేబ్రిడ్జి వద్ద ఖాళీ ట్రాక్టర్‌ను తూకం వేయించగా క్వింటా 40 కిలోలు వ్యత్యాసం వచ్చింది. రెండు ట్రాక్టర్ల ధాన్యం లోడ్‌లో 2 క్వింటాల 80 కిలోలు తేడా వచ్చిందని రైతుల తెలిపాడు.
ఆందోళనకు దిగిన రైతులు
వేబ్రిడ్జి తూకంలో మోసం బయటపడటంతో అదే సమయంలో ధాన్యం విక్రయించడానికి అక్కడికి వచ్చిన రైతులతో పాటు స్థానిక రైతులు కాంటా వద్ద ఆందోళకు దిగారు. మోసాలకు పాల్పడుతున్న వ్యాపారులను నిలదీశారు. తూకంలో మోసాలే కాకుండా వేవింగ్ మిషన్ కోసం ఒక బిల్లు రూ.100, గుమస్తా ఖర్చుల పేరుతో మరో రూ.200 అదనంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. క్వింటా ధాన్యానికి 2 కిలోల చొప్పున తగ్గిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో విక్రయించిన ధాన్యానికి క్వింటాకు రెండు రూపాయలు కట్ చేసుకుని, నెలలు గడిచినా ఇవ్వడం లేదన్నారు. వేబ్రిడ్జి కాంటాను సీజ్ చేసి, నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.
వ్యాపారి ఏమన్నాడంటే..
వేబ్రిడ్జి కాంటాలో సాంకేతిక లోపం వల్ల తూకంలో తేడా వచ్చిందని, తాము మోసాలకు పాల్పడలేదని వ్యాపారి, ధర్మకాంటా నిర్వాహకుడు అంతటి నర్సయ్య తన వివరణలో తెలిపారు.గోనె సంచుల గురించి తనకు తెలియదన్నారు. ధర్నాలో రైతులు చిన్న వెంకటయ్య, మలిపెద్ది సంతోష్, చుక్క వెంకటయ్య, దేవర శ్రీశైలం, కరుణాకర్‌రెడ్డి, కొల్లు శంకరయ్య, పద్మారెడ్డి, వెంకట్‌రెడ్డి, ఉప్పల లక్ష్మయ్య, కొల్లు వెంకన్న, సలిగంజి వెంకన్న, కొల్లు మచ్చగిరి, బీరయ్య, చేవూరి వెంకట్‌రెడ్డి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
వేబ్రిడ్జిల్లో భారీ వ్యత్యాసాలు
ఫ అనాజిపురం వద్ద వెలుగులోకి
ఫ రెండు ట్రాక్టర్ల ధాన్యం లోడ్లలో సుమారు మూడు క్వింటాళ్లు తేడా
ఫ ఆందోళనకు దిగిన రైతులు, కాంటాకు తాళం

తూకం తప్పుతున్న ధర్మకాంటా!