
పోలీసులపై దాడి చేసిన వలస కార్మికుల అరెస్ట్
హుజూర్‌నగర్ : పాలకవీడు మండలం దక్కెన్ సిమెంట్ పరిశ్రమ వద్ద పోలీసులపై దాడికి పాల్పడిన కార్మికులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బుధవారం హుజూర్‌నగర్‌లోని తన కార్యాలయంలో సీఐ చరమందరాజు కేసు వివరాలను వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. పాలకవీడు మండలం మహంకాళిగూడెం గ్రామ పరిధిలోని దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీలో ఈ నెల 21న ఉత్తరప్రదేశ్‌కు చెందిన కాంట్రాక్ట్ కార్మికుడు వినోద్ గుండెపోటుతో మృతిచెందాడు. అతడి మృతికి రూ.20లక్షలు నష్టపరిహారం చెల్లించాలని ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు చెందిన కార్మికులు 22వ తేదీన ఆ ఫ్యాక్టరీ మెయిన్ గేట్ ముందు బైఠాయించారు. వాహనాలను, మనుషులను లోపలకు, బయటకు వెళ్లకుండా ధర్నాను దిగారు. యాజమాన్యం సమాచారం మేరకు పాలకీడు ఎస్‌ఐ కోటేష్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని ఏదైనా సమస్య ఉంటే యాజమాన్యంతో మాట్లాడి సామరస్యంగా పరిష్కరించుకోవాలని ధర్నా చేస్తున్న వారిని సముదాయించారు. ఇంతలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముఖేష్ ప్రసాద్, మంజీత్ కుమార్, మన్సూర్ అలం, శక్తి చౌహన్, రవిశంకర్ సహాని, కిసాన్ సహాని, ధనంజయ్, కమలేష్ యాదవ్, ఉమేష్‌కుమార్‌యాదవ్‌తో పాటు బిహార్‌కు చెందిన పౌల్దార్, విక్రమ్ కుమార్, అభిషేక్ కుమార్, రాహుల్ కుమార్, మన్సూర్ అన్సారీ, సచిన్ విశ్వకర్మతో పాటు మరికొంత మంది వ్యక్తులు గ్రూపుగా ఏర్పడి కర్రలు, రాళ్లతో ఎస్‌ఐ, పోలీస్ సిబ్బందిపై దాడికి దిగారు. దీంతో ఎస్‌ఐ కోటేష్, హోంగార్డు గోపికి గాయాలు కాగా పోలీసు వాహనం అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఎస్‌ఐ ఫిర్యాదు మేరకు మేరకు సీఐ చమందరాజు కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాల్లో రికార్డయిన వ్యక్తులను గుర్తించి మంగళవారం విష్ణుపురం రైల్వే స్టేషన్ వద్ద నలుగురు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. వారిని విచారించి మిగతా వారిని పరిశ్రమలోని లేబర్ కాలనీలో పట్టుకోగా.. ఒకరు పరారయ్యారు. వారి వద్ద నుంచి కరల్రను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. పారిపోయిన వ్యక్తిని కూడా త్వరలో పట్టుకుంటామని చెప్పారు. శాంతిభధ్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా విడిచిపెట్టేది లేదని సీఐ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఫ 15 మంది రిమాండ్‌కు తరలింపు
ఫ ఒకరు పరార్