
‘రీజినల్’ అలైన్‌మెంట్ మారుస్తామని మోసం చేశారు
చౌటుప్పల్ రూరల్ : రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అనాలోచితంగా అలైన్‌మెంట్ ఖరారు చేస్తే.. తాము అధికారంలోకి వస్తే అలైన్‌మెంట్ మార్చుతామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హామీ ఇచ్చి మోసం చేశారని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్. వీరయ్య ఆరోపించారు. రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న చౌటుప్పల్ మండలంలోని మందోళ్లగూడెం, సింగరాయచెర్వు, తూర్పుగూడెం గ్రామ రైతులతో పాటు సంస్థాన్ నారాయణపురం మండలంలోని పుట్టపాక, శేరిగూడెం గ్రామాల్లో రైతులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రీజినల్ రింగ్ రోడ్డులో రైతులు కోల్పోతున్న భూములను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో కనీసం గ్రామసభలు నిర్వహించకుండా ఏకపక్షంగా భూములు లాక్కోవడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం మార్కెట్ ధర కూడా ఇవ్వకుండా రైతుల పట్ల అమానుషంగా వ్యవహరించడం దారుణమన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి 40కి.మీ. దూరంలో రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం చేస్తామని చెప్పి చౌటుప్పల్ మార్గంలో కేవలం 28కి.మీ. దూరంలోనే రోడ్డు నిర్మించడం వెనుక అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. అలైన్‌మెంట్ మార్చడం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నా కూడా రైతులను మోసం చేసేలా బీజేపీ నాయకులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ నెల 27న యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడిని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ జహంగీర్, బూరుగు కృష్ణారెడ్డి, మండల కార్యదర్శి గంగాదేవి సైదులు, మాజీ సింగిల్ విండో చైర్మన్ బోరెం నర్సిరెడ్డి, సప్పిడి లక్ష్మారెడ్డి, నాయకులు జీ. శ్రీనివాస్‌చారి, దోడ యాదిరెడ్డి, దొంతగోని పెద్దులు, కొండే శ్రీశైలం, సప్పిడి రాఘవరెడ్డి, బోరెం శ్రీనివాస్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.
ఫ సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు
ఎస్. వీరయ్య