పడి పోయిన భూగర్భజల మట్టం.. అధికంగా సేద్యానికి వినియోగం
నాన్‌ఆయకట్టులో నిరంతరాయంగా నడుస్తున్న బోర్లు
భూగర్భ జలవనరుల శాఖ నివేదికలో వెల్లడి
సాక్షి, యాదాద్రి: జిల్లాలో భూగర్భజలాలు పడి పోయాయి. గత సంవత్సరం మే నుంచి ఈ ఏడాది జూన్ నెల వరకు భూగర్భ జలవనరుల శాఖ పరి శీలనలో ఈ విషయం వెల్లడైంది. 45 గ్రామాల్లో ప్రమాదకరస్థాయిలో.. రెండు గ్రామాల్లో అత్యంత ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని హెచ్చరికలు జారీ చేసింది. సమృద్ధిగా వర్షాలు కురువకపోవడం, వ్యవసాయానికి అధికంగా నీటిని వినియోగిస్తుండటంతో ఈ పరిస్థితి ఏర్పడిందని వాటర్ ఇయర్ నివేదికలో పేర్కొంది.
భూమిలోకి ఇంకిన నీరు ఇలా..
భూగర్భ జల వనరుల శాఖ ఏటా మే నెల నుంచి జూన్(వాటర్ ఇయర్) వరకు నీటి నిల్వలు, వినియోగంపై పరిశీలన చేసి నివేదిక ఇస్తుంది. అందులో భాగంగా ఈ వాటర్ ఇయర్ ఇచ్చిన నివేదిక ప్రకారం అత్యధికంగా వర్షాల వల్ల 31 శాతం నీరు భూమిలోకి ఇంకింది. చెక్‌డ్యాంలు, పర్క్యులేషన్ ట్యాంకులతో 7 శాతం, చెరువులు, కుంటల వల్ల 6 శాతం, బోరుబావుల కింద సాగు చేసిన వరి ద్వారా వృథా నీటితో 20 శాతం, చెరువులు, రిజర్వాయర్ల కింద వరి సాగుద్వారా 26 శాతం నీరు భూమిలోకి ఇంకిందని భూగర్భ జలవనరుల శాఖ తేల్చింది. భూమిలోకి 100 యూనిట్‌ల జలాలు ఇంకి 70 యూనిట్‌లు మాత్రమే వాడుకుంటే సేఫ్‌జోన్‌గా పరిగణిస్తారు. 70నుంచి 90 యూనిట్‌లు వాడుకుంటే సెమీ క్రిటికల్‌గా, 90 నుంచి 100 అత్యంత ప్రమాదకరమని, 100 నుంచి 110 అత్యంత జఠిలంగా పరిగణిస్తారు.
85 శాతం నీళ్లు వ్యవసాయానికే..
భూగర్భంలోకి ఇంకిన మొత్తం నీటిలో సింహభాగం సేద్యానికి వినియోగించారు. వానాకాలం, యాసంగి సీజన్లలో 85శాతం నీటిని పంటల సాగుకు తోడేశారు. పరిశ్రమలకు 9 శాతం, గృహసరాలకు 6 శాతం నీటిని వాడారు. నాన్ ఆయకట్టులో ఒక లక్షకు పైగా బోర్లు నిరంతరాయంగా నడుస్తున్నాయి. పరిశ్రమల్లో 60 వేల వరకు బోర్లు ఉన్నాయి. ఇవి కాకుండా పంక్షన్‌హాళ్లు,ఇళ్లు హోటళ్లు, అపార్ట్‌మెంట్లలో ఉన్న బోర్ల ద్వారా నీటి వినియోగం పెరిగింది. ప్రధానంగా భువనగిరి, చౌటుప్పల్, యాదగిరిగుట్ట, ఆలేరు, పోచంపల్లి మున్సిపాలిటీల్లో నీటి వినియోగం అధికంగా ఉంది.
అధికంగా నీటిని తోడేసిన గ్రామాలు ఇవీ..
ఆలేరు, బహుద్దూర్‌పేట, గొలనుకొండ, శ్రీనివాసపురం, టంగుటూరు, ఆత్మకూర్(ఎం), ధర్మాపూర్, కాల్వపల్లి, కప్రాయపల్లి, కొరటికల్, లింగరాజుపల్లి, మొరిపిరాల, పల్లెపహాడ్, రహీంఖాన్‌పేట,రాయిపల్లి, సర్వేపల్లి, భాగా యత్ భువనగిరి, తాజ్‌పూర్, మహదేవ్‌పూర్, రాయరావుపేట, రామలింగంపల్లి, అల్లాపూర్, చౌటుప్పల్, దేవలమ్మనాగారం, ఖైతాపురం, లక్కారం, లింగోజిగూడెం, పీపల్‌పహాడ్, తంగెడుపల్లి, తాళ్లసింగారం, ఎల్లగిరి, బుజిలాపూర్, చిల్లాపురం, చిమిర్యాల, గుడ్డిమల్కాపురం, గుజ్జ, జనగామపల్లె, కొత్తగూడెం, కోతులాపురం, మహమ్మదాబాద్, నారాయణపురం, సర్వేల్, వాయిల్‌పల్లి, చల్లూరు, కోమటికుంటలో ప్రమాదకరస్థాయిలో భూగర్భ నీటి మట్టాలు ఉన్నాయి. సంస్థాన్‌నారాయణపురం, ఆత్మకూర్(ఎం)లో అత్యంత దారుణంగా 100 శాతం పైగా నీటిని తోడేశారు. కాగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భూగర్భ జలం కొంత మేరకు పెరిగే అవకాశం ఉంది.
నీటి సంరక్షణకు చర్యలు
జిల్లాలో 45 గ్రామాల్లో భూగర్భ నీటి వినియోగం అధికంగా ఉంది. జలశక్తి అభియాన్ పథకంలో భూగర్భజలాలను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. నీటి వృథాను అరికట్టేందుకు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. –జ్యోతికుమార్, డిప్యూటీ డైరెక్టర్, భూగర్భ జలవనుల శాఖ