బత్తాయిలో వేసవి పంటకు అనువైన సమయమిదే.. | - | Sakshi
Sakshi News home page

బత్తాయిలో వేసవి పంటకు అనువైన సమయమిదే..

Sep 9 2025 6:42 AM | Updated on Sep 9 2025 6:42 AM

బత్తా

బత్తాయిలో వేసవి పంటకు అనువైన సమయమిదే..

గుర్రంపోడు : బత్తాయి తోటల్లో కాయల కోతలు చివరిదశలో ఉండి ఇప్పటికే కాయలు కోసిన తోటల్లో వేసవి పంట తెచ్చేందుకు రైతులు సమాయత్తమవుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలు అనంతరం వాతావరణం వేడిగా మారడం వల్ల బత్తాయిలో కొద్దిపాటి వాడు లక్షణాలు కనిపించినా కత్తెర పంటకు అనుకూలంగా ఉంటుంది. బత్తాయిలో వర్షాకాలంలో కోతకు వచ్చే కాయల కంటే వేసవిలో వచ్చే పంటకు రెండింతల ధర అధికంగా లభిస్తుంది. ఈ రెండు సీజన్లలో కాయల ధరల్లో ఎక్కువ వ్యత్యాసానికి వర్షాకాలంలో బత్తాయి కాయల వినియోగం చాలా తక్కువగా ఉండటమే కారణం. వేసవిలో అధిక పంట పొందాలంటే సెప్టెంబర్‌లో చెట్లు వాడుపట్టాలి. ఈ మాసంలో వర్షాలు ఉంటున్నందున కష్టంతో కుడుకున్న పనే అవుతుంది. అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఇప్పటికే కాయల కోతలు పూర్తయిన రైతులు వేసవి పంట తెప్పించేందుకు చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు, మెళకువలను హాలియా ప్రాంతీయ ఉద్యానవన శాఖాధికారి మురళి వివరించారు.

లేత తోటలు

బత్తాయి తోటల్లో యాజమాన్య పద్ధతులు అవలంబిస్తే ఐదవ సంవత్సరం నుంచి కాపు వస్తుంది. తోటలను దున్నడం, పాదులు తవ్వడం, ఎండు పుల్లలను తొలగించడం లాంటి అంతరకృషి పనులు పూర్తి చేయాలి. ఆగస్టు, సెప్టెంబర్‌ మాసాల్లో నీటి తడులను ఆపివేసి చెట్లు వాడుకు గురయ్యేటట్లు చేయాలి. ప్రతి చెట్టుకు 40 కిలోల పశువుల ఎరువు లేదా 10 కిలోల వర్మి కంపోస్టు మూడున్నర కిలోల ఆముదం లేదా వేప పిండి, 600 గ్రాముల యూరియా, 900 గ్రాముల సింగిల్‌ సూపర్‌ పాస్పెట్‌, 400 పోటాష్‌ను కలిపి పాదంతా సమంగా వేసి నీటి తడులు ఇవ్వాలి. ఇలా చేస్తే కాయలు మే మాసంలో కోతకు వస్తాయి. ఈ కాపు నిలబడాలంటే డిసెంబర్‌, జనవరి మాసాల్లో చెట్లను వాడుకు గురి చేయకుండా నీటిని అందించాలి. అయినప్పటికీ రుతు క్రమాన్ని బట్టి చెట్లలో కొంత పూత వస్తుంది. వర్షాకాలంలో కాయలు వస్తాయి. దీని వల్ల వేసవిలో అధిక పంట, వర్షాకాలంలో సీజన్‌ పంట తక్కువగా వస్తాయి. ఇలా ఒకటి, రెండు సంవత్సరాలు అలవాటు చేసుకుంటూ పోతె చెట్లు ఈ పద్ధతికి అలవాటు పడతాయి. ఎండాకాలం పంట ఎక్కువగానూ వర్షాకాలం పంట తక్కువగానూ వచ్చి రైతులకు రాబడులు పెరుగుతాయి.

ముదురు తోటలు

ప్రస్తుతం కాపునిస్తున్న ముదురు తోటల్లో వేసవి పంట పెంచేందుకు 50 కిలోల పశువుల ఎరువు, 5 కిలోల వేప పిండి లేదా ఆముదం పిండి, 750 గ్రాముల యూరియా, 1200 గ్రాముల సింగిల్‌ సూపర్‌ పాస్పెట్‌, 500 గ్రాముల పోటాష్‌లను ప్రతి చెట్టుకు వేసి నీరందించాలి. దీంతో కొత్తగా వచ్చిన చిగురు, రెమ్మలను పురుగుల బారి నుంచి కాపాడుకునేందుకు లీటర్‌ నీటికి 1.5 మీల్లిలీటర్ల మోనో ప్రోటోపాస్‌ మందును పిచికారీ చేయాలి. సూక్ష్మ పోషక లోపాలను సవరించేందుకు 5 గ్రాముల జింక్‌ సల్ఫేట్‌, 2 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్‌, 2 గ్రాముల మాంగనీస్‌ సల్ఫేట్‌, 2 పెర్రస్‌ సల్ఫేట్‌, 1 గ్రాము బోరాక్స్‌, 6 గ్రాములు సున్నం, 10 గ్రాముల యూరియాను లీటర్‌ నీటికి చొప్పున కలిపి 15 రోజుల వ్యవధిలో ద్రావణాన్ని రెండుసార్లు చెట్లప పిచికారీ చేయాలి. ఈ వేసవి కాపు చెట్టుపై అధికంగా ఉంటే జనవరి మాసంలో మళ్లీ చెట్లకు వాడు అవసరం లేకుండానే సాధారణంగా వచ్చే పంటను మాత్రమే తీసుకోవాలి.

చీడపీడల నివారణ

వర్షాకాలంలో బత్తాయి తోటల్లో ఎక్కువగా గజ్జి తెగులు, కాయ తొడిమ కుళ్లు తెగులు, దోమకాటు ఎక్కువగా సోకుతాయి.

గజ్జి తెగులు : ఈ తెగులు బత్తాయి, నిమ్మ తోటలకు వర్షాకాలంలో ఎక్కువగా సోకుతుంది. గజ్జి మచ్చలు ఆకులు, కొమ్మలు, ఆకు తొడిమలపై ఏర్పడతాయి. దీని నివారణకు తెగులు సోకిన ఎండు కొమ్మలను కత్తిరించి నాశనం చేయాలి. 10 లీటర్ల నీటిలో 1 గ్రాము సెప్టో సైక్లిన్‌, 30 గ్రాముల కాపర్‌ ఆక్సిక్లోరైడ్‌ మందును వర్షాకాలంలో 20 రోజులకు ఒక్కసారి రెండు సార్లు పిచికారీ చేయాలి.

దోమకాటు : బత్తాయి పండ్లు పక్వానికి వచ్చే దశలో దోమలు రాత్రిపూట కాయలపై కాటు వేసి రసాన్ని పీల్చడం వల్ల విపరీతమైన నష్టం ఏర్పడుతుంది. ఈ తెగులు ఆశించిన కాయలు కుళ్లిపోయి రాలిపోతాయి. దీని నివారణకు తోటల్లో రాత్రి పూట లైట్లు పెట్టి అక్కడక్కడా ప్లేట్లలో మలాథీయాన్‌ ఒక మిల్లీ లీటర్‌ మందును ఒక శాతం చక్కెర, పండ్లరసంతో కలిసి విషపు ఎరను ఉంచాలి. వెళుతురుకు దోమలు ఆకర్శించబడి మిశ్రమాన్ని పీల్చి చనిపోతాయి.

కాయ తొడిమ కుళ్లు తెగులు

మొదట తొడిమకు దగ్గరగా కుళ్లు మచ్చ ఏర్పడుతుంది. మచ్చ వక్క రంగులో తొడిమ చుట్టూ కాయపై ఏర్పడుతుంది. క్రమంగా ఈ మచ్చ కాయంతా వ్యాపించి లోపలి భాగాలు కుళ్లి మెత్తబడతాయి. తెగులు సోకిన కాయలు రాలిపోవడం గాని లేదా ఎండి చెట్లు అంటిపెట్టుకుని ఉంటాయి. దీని నివారణకు వర్షాకాలంలో నెలకొకసారి 1 గ్రాము కార్బండిజం మందును ఒక లీటర్‌ నీటికి కలిపి కాయలు పూర్తిగా తడిసేలా పిచికారీ చేయాలి.

బత్తాయిలో వేసవి పంటకు అనువైన సమయమిదే..1
1/1

బత్తాయిలో వేసవి పంటకు అనువైన సమయమిదే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement