
విద్యార్థుల ప్రతిభకు ప్రోత్సాహకం
చిలుకూరు: కేంద్ర ప్రభుత్వ కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభా పోటీలు నిర్వహించి ఉపకార వేతనాలను తపాలా శాఖ ద్వారా దీన్‌దయాళ్ స్పర్శ్ యోజన పేరుతో మంజూరు చేస్తోంది. తపాలా బిళ్లల సేకరణ, అధ్యయనం(ఫిలాటెలీ)తో కలిగే ప్రయోజనాలపై పోటీలు నిర్వహించి ఎంపికై న విద్యార్థులకు నెలకు రూ.500 చొప్పున ఉపకార వేతనాలు అందించనుంది. 2024–25 విద్యాసంవత్సరంలో వార్షిక పరీక్షల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 55 శాతం, బీసీ, ఓసీలు 60 శాతం మార్కులు సాధించినవారు ఈ పోటీలకు అర్హులు.
రెండు దశల్లో పరీక్ష
రెండు దశల్లో పరీక్ష నిర్వహిస్తారు. ప్రతి రాష్ట్రంలో ఒక్కో తరగతి నుంచి పది మంది చొప్పున (6 నుంచి 9వ తరగతి వరకు) 40 మందిని ఉపకార వేతనాలకు ఎంపిక చేస్తారు. మొదటి దశ పరీక్షలో జనరల్ నాలెడ్జ్‌కు 5 మార్కులు, చర్రితకు 5, జాగ్రఫీకి 5, సైన్స్‌లో 5, క్రీడలు, సంస్కృతి, పర్సనాలిటీ అంశాలకు 5, లోకల్ ఫిలాటెలీకి 10 మార్కులు, నేషనల్ ఫిలాటెలీకి 15 చొప్పున మొత్తం 50 మార్కులు కేటాయిస్తారు. మొదటి దశలో ప్రతిభ చాటిన వారిని రెండో దశకు ఎంపిక చేస్తారు. రెండో దశలో విద్యార్థులు తపాలా శాఖ ఇచ్చే అంశాలపై ఉత్తమ ప్రాజెక్టు రూపొందిస్తే ఎంపిక చేస్తారు. వారికి ఏడాది పాటు నెలకు రూ. 500 చొప్పున రూ. 6 వేలు చెల్లిస్తారు. ఎంపికై న విద్యార్థుల పేరుతో ప్రత్యేకంగా పొదుపు ఖాతాలు తెరిపించి ప్రతి నెల డబ్బులు జమ చేస్తారు. ఈ నెలాఖరున మొదటి దశ పరీక్ష నిర్వహించి అక్టోబర్‌లో ఫలితాలు విడుదల చేస్తారు. ఆ తరువాత రూపొందించిన ప్రాజెక్టును వచ్చే నెల 30లోగా సమర్పించాలి. తుది ఫలితాలు డిసెంబర్‌లో ప్రకటిస్తారు. ఈ పోటీల్లో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొనేలా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు దృష్టి పెట్టాలని డీఈఓ అశోక్ తెలిపారు.
13వ తేదీ వరకు గడుపు
అర్హులైన విద్యార్థులు ఈ నెల 13లోగా తపాలా కార్యాలయాల నుంచి దరఖాస్తులు పొందవచ్చు. చదువుతున్న పాఠశాల ప్రధానోపాధ్యాయుల నుంచి స్టడీ సర్టిఫికెట్ తీసుకొని తపాలా కార్యాలయానికి వెళ్లి రూ. 200 చెల్లించి ఫిలాటెలీ డిపాజిట్(పీడీ) ఖాతాను తీసుకోవాలి. అయితే ఈ పథకంపై విద్యార్థులకు పూర్తి స్థాయి అవగాహన లేకపోవడంతో నేటి వరకు ఏ ఒక్క విద్యార్థి కూడా దరఖాస్తు చేసుకోలేదని తపాలా శాఖా వారు చెబుతున్నారు.
కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ప్రతిభా పోటీలు
రెండు దశల్లో పరీక్షలు
ఎంపికై న విద్యార్థులకు నెలకు
రూ. 500 చొప్పున ఉపకార వేతనం
దరఖాస్తుకు 13 వరకు గడువు