
నిరసనల నడుమ గణేష్ శోభాయాత్ర
భువనగిరి: భువనగిరి పట్టణంలో జరిగిన గణేష్ శోభాయాత్ర నిరసనలు, ధర్నాల నడుమ కొనసాగింది. పట్టణంలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి చిన్న విగ్రహాలను పెద్ద చెరువులో నిమజ్జనం చేసేందుకు తరలించారు. మరికొన్ని భారీ విగ్రహాలను సాయంత్రం తర్వాత కదిలించడం ప్రారంభించారు. ఈక్రమంలో తాతానగర్‌లో యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డీజేకి అనుమతి లేదని పోలీసులు దానిని తొలగించారు. సింగిల్ పిన్ డీజేకు ముందుగానే అనుమతించి ఇప్పుడు లేదని చెప్పడం సరికాదని మండప నిర్వాహకులు స్థానిక బాబు జగ్జీవన్‌రామ్ చౌరస్తా వద్ద ధర్నాకు దిగారు. దీంతో వాహనాలు నిలిచిపోయాయి.
లాఠీచార్జ్ చేయడంతో..
సాధారణంగా భువనగిరి పట్టణంలో వినాయక శోభాయాత్ర సమ్మద్ చౌరస్తా మీదుగా కొనసాగుతుంది. ఈ క్రమంలో వినాయక విగ్రహాలకు సమ్మద్ చౌరస్తాకు చేరుకున్న తర్వాత కొద్ది సమయం అక్కడ భజన చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈక్రమంలో శనివారం తెల్లవారుజామున మండపాల నిర్వాహకులు భజన చేస్తున్న క్రమంలో పోలీసులు ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని భజనలు చేయకుండా వెళ్లిపోవాలని సూచించారు. కొద్దిసేపు భజన చేసి వెళ్తామని చెప్పి భజనలు చేస్తుండగా పోలీసులు వారిని ముందుకు తోశారు. దీంతో మండపాల నిర్వాహకులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో మండపాల నిర్వాహకులు అక్కడే నిరసన తెలిపారు. అనంతరం లాఠీచార్జ్‌ను నిరసిస్తూ భువనగిరి గణేష్ ఉత్సవ సమితితో కలిసి నిర్వాహకులు ప్రిన్స్‌చౌరస్తా వద్ద రోడ్డుపై ధర్నా చేశారు. విషయం తెలుసుకున్న అడిషనల్ డీసీపీ, పట్టణ సీఐ అక్కడకు చేరుకుని వారితో మాట్లాడి ఽసర్ది చెప్పడంతో ధర్నా విరమించారు. పట్టణ సీఐ రమేష్‌ను వివరణ కోరగా ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందనే ఉద్దేశంతో మాత్రమే వారిని ముందుకు వెళ్లాలని సూచించినట్లు చెప్పారు.
డీజే తొలగించినందుకు పోలీసులతో మండపాల నిర్వాహకుల వాగ్వాదం
భజనలు చేయకుండా
అడ్డుకుంటున్నారని ధర్నాకు దిగిన ఉత్సవ సమితి నాయకులు
కానిస్టేబుల్‌పై దాడి
కోదాడరూరల్ : వినాయక శోభాయాత్రలో కొందరు అల్లరిమూకలు కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడ్డారు. కోదాడ పట్టణంలోని అనంతగిరి రోడ్డులో ఉన్న పెద్ద చెరువులో గణనాథులను నిమజ్జనం చేసేందుకు విగ్రహాలను తరలిస్తున్నారు. ఈ క్రమంలో అనంతగిరి రోడ్డులో కొంతమంది అల్ల రిమూకలు గొడవపడుతున్నారు. కానిస్టేబుల్ నరేష్ గొడవను ఆపేందుకు ప్రయత్నించారు. మద్యం మత్తులో ఉన్న అల్లరిమూకలు కానిస్టేబుల్ తలపై ఐరన్‌రాడ్డుతో దాడి చేయడంతో తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు, సిబ్బంది అతడిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం పట్టణంలోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి ఆస్పత్రికి చేరుకొని గాయపడిన కానిస్టేబుల్‌ను పరామర్శించారు. దాడి చేసిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.